పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి దున్నపోతును తెచ్చుకుంటారా..?
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటలను గెలిపించి తనను బాధ పెట్టారని పరోక్షంగా ప్రస్తావించారు సీఎం కేసీఆర్. గతంలో మీరు ఓసారి బాధ పెట్టారు, పర్వాలేదు, ఆరోజు అలా జరిగిపోయింది కానీ మళ్లీ అలా జరగడానికి వీల్లేదు అని అన్నారు.
పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి దున్నపోతును ఎవరైనా తెచ్చుకుంటారా అని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. పరోక్షంగా ఈటల రాజేందర్ పై సెటైర్లు పేల్చారు. కౌశిక్ ని గెలిపిస్తే అన్ని రకాలుగా అండదండగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్. ఈటల రాజేందర్ కూడా లేని రోజుల్లో కౌశిక్ రెడ్డి తండ్రి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు.
నన్ను బాధపెట్టారు..
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఈటలను గెలిపించి తనను బాధ పెట్టారని పరోక్షంగా ప్రస్తావించారు సీఎం కేసీఆర్. గతంలో మీరు ఓసారి బాధ పెట్టారు, పర్వాలేదు, ఆరోజు అలా జరిగిపోయింది కానీ మళ్లీ అలా జరగడానికి వీల్లేదు అని అన్నారు. నల్లదేదో, తెల్లదేదో మీకు తెలిసిపోయింది కదా, మంచివైపు పోతే మంచి జరుగుతుంది, చెడువైపు వెళ్తే చెడు జరుగుతుందని.. ఏవైపు వెళ్లాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ప్రభుత్వంలో ఉండే కౌశిక్ రెడ్డికి ఓటేస్తే నియోజకవర్గానికి లాభం ఉంటుంది కానీ, వేరే వాళ్లకు ఓటేస్తే ఏముంటుందని ప్రశ్నించారు కేసీఆర్. బీజేపీకి ఓటేస్తే మురిగిపోయినట్టేనని చెప్పారు.
కౌశిక్ రెడ్డి తనకు కొడుకు లాంటి వాడని చెప్పారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ లో కౌశిక్ తనతోపాటే ఉంటాడని, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటూ, విప్ గా కూడా ఉన్నాడని, రేపు హుజూరాబాద్ లో గెలిస్తే అందరికీ సేవ చేస్తాడని అన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు అయిన కౌశిక్ రెడ్డిని గెలిపిస్తే హుజూరాబాద్‌కు అన్ని రకాలుగా మేలు జరుగుతుందన్నారు. హుజూరాబాద్ లో కొన్ని మండలాలు కావాలని ఆయన కోరాడని, అవన్నీ నెరవేరుస్తానని చెప్పారు.