గద్వాలను గబ్బు పట్టించారు..
కృష్ణా, తుంగభద్ర అనే రెండు నదుల మధ్య ఉన్న నడిగడ్డను కూడా కాంగ్రెస్ నేతలు ఆగం పట్టించారని విమర్శించారు కేసీఆర్. ఆర్డీఎస్ ను ఆగం పట్టించిన పార్టీ ఏది..? అని ప్రశ్నించారు.
గద్వాలను గబ్బుపట్టించిన గబ్బునాయాళ్లు అంటూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. గద్వాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. అష్టాదశ శక్తి పీఠాల్లో మన జోగులాంబ తల్లి దేవాలయం ఒకటని, అందుకే జోగులాంబ గద్వాల జిల్లా అని పేరుపెట్టుకున్నామని చెప్పారు. ఘన చరిత్ర ఉన్న గద్వాలను కాంగ్రెస్ పాలకులు గబ్బు పట్టించారని మండిపడ్డారు.
కృష్ణా, తుంగభద్ర అనే రెండు నదుల మధ్య ఉన్న నడిగడ్డను కూడా కాంగ్రెస్ నేతలు ఆగం పట్టించారని విమర్శించారు కేసీఆర్. ఆర్డీఎస్ ను ఆగం పట్టించిన పార్టీ ఏది..? అని ప్రశ్నించారు. నాటి ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులు నీళ్ల గురించి కొట్లాడలేదని, రఘువీరారెడ్డి వస్తే అనంతపురం దాకా నీళ్లు తీసుకువెళ్లమని మంగళ హారతులు పట్టారని చెప్పారు. ర్యాలంపాడు రిజర్వాయర్ ని పెద్దది చేసి నీళ్లు తెస్తే గద్వాల పచ్చబడ్డదని అన్నారు. గట్టు మండలానికి నీళ్లు కావాలని గట్టు ఎత్తిపోతల పథకం కూడా తెచ్చామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ హయాంలో అన్నిరకాలుగా గద్వాల అభివృద్ధి చెందిందని వివరించారు కేసీఆర్.
గద్వాలకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ వచ్చాయని, 300 పడకల ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేసుకున్నామని, కొత్త బస్టాండ్ కట్టుకున్నామని, జూరాల వద్ద అద్భుతమైన గార్డెన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు కేసీఆర్. ఇక గద్వాల ప్రాంతంలో ఉన్న వాల్మీకి బోయ సోదరులకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేస్తే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టిందన్నారు. వాల్మీకి బోయలను కాంగ్రెస్ ఆనాడు మోసం చేస్తే, ఇప్పుడు కూడా వారికి రిజర్వేషన్ల ఫలాలు అందకుండా బీజేపీ అడ్డుపడుతోందని చెప్పారు కేసీఆర్.