Telugu Global
Telangana

అది పూర్తయితే దేవరకొండ దరిద్రం పోతుంది -కేసీఆర్

దేవరకొండకు అగ్రిక‌ల్చ‌ర్ పాలిటెక్నిక్ కాలేజీ తీసుకొచ్చే బాధ్య‌త తనది అని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. స్థానిక ఎమ్మెల్యే రవీందర్ నాయక్ కు ఈసారి డబుల్ మెజార్టీ రావాలని ప్రజలకు సూచించారు.

అది పూర్తయితే దేవరకొండ దరిద్రం పోతుంది -కేసీఆర్
X

తెలంగాణ రాక ముందు ప‌రిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాల‌ని ప్రజల్న కోరారు సీఎం కేసీఆర్. క‌రెంట్, మంచి నీళ్లు, సాగునీటి బాధలు తొలగిపోయాయని చెప్పారు. అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేసుకుంటున్నామన్నారు. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో ఒక్క తండాను కూడా గ్రామ‌పంచాయ‌తీ చేయ‌లేదని, బీఆర్ఎస్ హయాంలో తండాల్లో మా రాజ్యం అనే నినాదాన్ని నిజం చేసుకున్నామన్నారు. 10 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేసుకున్నామని చెప్పారు. దేవరకొండ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. ఈ ప్రాంతంపై తనకెప్పుడూ ప్రత్యేక శ్రద్ధ ఉంటుందన్నారు.

దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే ర‌వీంద‌ర్ నాయ‌క్ ఉద్య‌మాల నుంచి వ‌చ్చిన బిడ్డ అని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. పార్టీలో చేరినప్ప‌టి నుంచి డిండి ప్రాజెక్టు కోసం, ఇక్క‌డి రైతాంగ సమస్యలు, సాగునీటికోసం మాట్లాడేవారన్నారు. కాంగ్రెస్ నాయ‌కుల వల్లే డిండి లిఫ్ట్ ఇరిగేష‌న్ ఆగిందని, ఇప్పుడిప్పుడే కోర్టు చిక్కులు పోయాయని చెప్పారు. రాబోయే రోజుల్లో డిండి ప్రాజెక్టు పూర్త‌వుతుందని, ఈ ప్రాజెక్ట్ కి పాల‌మూరు ఎత్తిపోత‌లకు లింక్ ఉంటుంది కాబట్టి.. ఐదు రిజ‌ర్వాయ‌ర్లు, ఒక బ్యారేజ్ కూడా దేవ‌ర‌కొండ‌లో వ‌స్తుందన్నారు. డిండి పూర్తయితే దేవ‌ర‌కొండ నియోజ‌క‌వ‌ర్గం ద‌రిద్రం పోతుంద‌ని చెప్పారు కేసీఆర్.

డ‌బుల్ మెజార్టీ రావాలి..

దేవరకొండకు అగ్రిక‌ల్చ‌ర్ పాలిటెక్నిక్ కాలేజీ తీసుకొచ్చే బాధ్య‌త తనది అని హామీ ఇచ్చారు కేసీఆర్. స్థానిక ఎమ్మెల్యే రవీందర్ నాయక్ కు ఈసారి డబుల్ మెజార్టీ రావాలని ప్రజలకు సూచించారు. దేవ‌ర‌కొండ చ‌రిత్ర‌లో ఇదే పెద్ద మీటింగ్ అని చెప్పారు. ఎన్నిక‌ల త‌ర్వాత మళ్లీ వచ్చి ఒకరోజంతా దేవరకొండలోనే ఉంటానని హామీ ఇచ్చారు. వెనుక‌పడ్డ ప్రాంతాల్లో పేద‌రికం పోవాలని, మంచి వ్య‌క్తిని గెలిపించుకుంటేనే మంచి జ‌రుగుతుందని చెప్పారు కేసీఆర్.

First Published:  1 Nov 2023 8:06 AM IST
Next Story