Telugu Global
Telangana

కాంగ్రెస్ వస్తే ధరణి బంగాళాఖాతానికి, రైతులు అరేబియా సముద్రానికి..

మహారాష్ట్రలో పార్టీ పెట్టాలని అక్కడి ప్రజలు అడుగుతున్నారని, లేదా తమ ధర్మాబాద్ తాలూకాని తెలంగాణలో కలుపుకోవాలని అభ్యర్థిస్తున్నారని, మన పాలనపై అక్కడి ప్రజలకు అంత నమ్మకం ఉందన్నారు కేసీఆర్.

కాంగ్రెస్ వస్తే ధరణి బంగాళాఖాతానికి, రైతులు అరేబియా సముద్రానికి..
X

"ఉన్న నీళ్లని ఊడగొట్టింది కాంగ్రెస్, నిజాంసాగర్ ని ముంచింది కాంగ్రెస్, నిజాంసాగర్ కి పూర్వ వైభవం తెచ్చింది బీఆర్ఎస్.." అని చెప్పారు సీఎం కేసీఆర్. ఇది మీ కళ్ల ముందు ఉన్న సాక్ష్యం అని, బోధన్ నియోజకవర్గ ప్రజలకు అనుభవంలోని విషయం అని అన్నారు. నిజాంసాగర్ నీళ్లు హైదరాబాద్ కి బంద్ చేశామని, కాళేశ్వరానికి లింకు చేసుకున్నామని.. 365రోజులు నిజాంసాగర్ లో నీరు నిలిచే ఉంటుందని హామీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఇరిగేషన్ మంత్రిది ఇదే నియోజకవర్గం అని, కానీ ఆయన పట్టించుకోలేదని, పైసా తేలేదని ఎద్దేవా చేశారు. బోధన్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ కి భారీ మెజార్టీ రావాలని చెప్పారు. ఈ సభలో ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొన్నారు.


16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారని, వారికి ఏ రాష్ట్రంలోనూ పెన్షన్ లేదన్నారు కేసీఆర్. తెలంగాణలో మాత్రమే పెన్షన్ సౌకర్యం ఉందని చెప్పారు కేసీఆర్. బీడీ కార్మికులకు కూడా పెన్షన్ రూ.5వేలకు పెంచుతున్నామని చెప్పారు. బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు షకీల్ హయాంలోనే జరిగాయని, అందరికోసం పనిచేసిన వారిని, కష్టపడిన వారిని మరోసారి ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు కేసీఆర్. షకీల్ గెలిస్తే ధరణి ఉంటుందని, లేకపోతే ధరణి బంగాళాఖాతానికి, రైతులు అరేబియా సముద్రానికి అని అన్నారు.

కాంగ్రెస్ హయాంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసన్నారు సీఎం కేసీఆర్. తిరిగి అధికారంలోకి వస్తే 3 గంటలు మాత్రమే కరెంటు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, వారికి అధికారం ఇద్దామా అని ప్రశ్నించారు. ధరణిని తీసేస్తామంటున్నారని, రైతు బంధు కావాలా వద్దా అని అడిగారు కేసీఆర్. 50 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడైనా రైతుబంధు అనే పేరు వినపడిందా అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో పార్టీ పెట్టాలని అక్కడి ప్రజలు అడుగుతున్నారని, లేదా తమ ధర్మాబాద్ తాలూకాని తెలంగాణలో కలుపుకోవాలని అభ్యర్థిస్తున్నారని, మన పాలనపై అక్కడి ప్రజలకు అంత నమ్మకం ఉందన్నారు కేసీఆర్.

First Published:  15 Nov 2023 2:49 PM IST
Next Story