Telugu Global
Telangana

మోదీకి అదో పిచ్చి.. యూపీ సీఎం మనకు నీతులు చెబుతాడా..?

మహారాష్ట్రలో సాగునీటికి కూడా రైతుల దగ్గర ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తుందని, మన దగ్గర అలాంటి పరిస్థితి లేదన్నారు. ఇక్కడ నీళ్లు ఫ్రీ, కరెంటు ఫ్రీ, పెట్టుబడి ఫ్రీ, ధాన్యం కూడా ప్రభుత్వమే కొంటుందని, రైతు బీమా కూడా ఉందని చెప్పారు సీఎం కేసీఆర్.

మోదీకి అదో పిచ్చి.. యూపీ సీఎం మనకు నీతులు చెబుతాడా..?
X

బాల్కొండ నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా కూడా తనకు మోతె గ్రామం గుర్తొస్తుందని చెప్పారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ముందు రాష్ట్రం కావాలని తీర్మానం చేసిన గ్రామం మోతె అని అన్నారు. ఆ గ్రామం మట్టిని తాను ముడుపు కట్టి హైదరాబాద్ తీసుకెళ్లానని గుర్తు చేశారు. మోతె గ్రామస్తులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని చెప్పారు కేసీఆర్. బాల్కొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.


కాంగ్రెస్ పాలన మనం చూడలేదా..?

ఒక్క ఛాన్స్ అంటూ కాంగ్రెస్ అడుగుతోందని, 11 ఛాన్స్ లు ఇస్తే ఏం చేశారని నిలదీశారు సీఎం కేసీఆర్. వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారనేది ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందు బాల్కొండలో ఏం జరిగింది, ఆయన హయాంలో ఏం జరిగిందనేది ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. ప్రశాంత్ రెడ్డి తనకు కొడుకు లాంటి వారని చెప్పారు కేసీఆర్. నియోజకవర్గంలో 18 సబ్ స్టేషన్లు కట్టారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక సబ్ స్టేష్ కావాలంటే మూడేళ్లు తిరగాల్సి వచ్చేదన్నారు. ట్రాన్స్ ఫార్మర్ కాలితే బోరుకి 2వేల రూపాయలు అడిగేవారన్నారు. మళ్లీ ఆ రాజ్యం కావాలా అని అడిగారు. దేశం మొత్తంలో తెలంగాణ మినహా ఏ రాష్ట్రం కూడా 24గంటలు రైతులకు కరెంటు ఇవ్వలేకపోతోందన్నారు కేసీఆర్.

మోదీకి అదో పిచ్చి..

నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్ అనే పిచ్చి లేచిందని, రైళ్లు, విమానాలు, ఓడ రేవులు ప్రైవేటు పరం చేశారని, చివరకు కరెంటు కూడా ప్రైవేటుపరం చేశారన్నారు. ప్రతి బోరు దగ్గర మీటరు పెట్టి పైసలు వసూలు చేయాలని కండిషన్ పెట్టారని, కానీ తల తెగిపడ్డా ఒప్పుకునేది లేదని తాను చెప్పానన్నారు. రాష్ట్రానికి రావాల్సిన 25వేల కోట్ల రూపాయల నిధులు ఆపారని అయినా తాను తలొంచలేదన్నారు. వ్యవసాయ స్థిరీకరణ కోసమే ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు కేసీఆర్. మహారాష్ట్రలో సాగునీటికి కూడా రైతుల దగ్గర ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తుందని, మన దగ్గర అలాంటి పరిస్థితి లేదన్నారు. ఇక్కడ నీళ్లు ఫ్రీ, కరెంటు ఫ్రీ, పెట్టుబడి ఫ్రీ, ధాన్యం కూడా ప్రభుత్వమే కొంటుందని, రైతు బీమా కూడా ఉందని చెప్పారు సీఎం కేసీఆర్.

17 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారని, బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు సీఎం కేసీఆర్. తెలంగాణలో అన్ని కుటుంబాలకు దళితబంధు అందుతుందని, ఏ ఒక్కరూ నిరాశపడొద్దని చెప్పారు. కుల, మత, భేద భావం లేకుండా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. ఉత్తర ప్రదేశ్ నుంచి నాట్లు వేసేందుకు ఇక్కడికి కూలీలు ఉపాధి కోసం వస్తున్నారని, ఇక ఆ రాష్ట్ర సీఎం మన దగ్గరకు వచ్చి ప్రచారం చేసేదేంటని ప్రశ్నించారు. అక్కడ పాలన చక్కగా చూసుకోవాలని హితవు పలికారు కేసీఆర్.


First Published:  2 Nov 2023 4:08 PM IST
Next Story