మన్యం బిడ్డలకు మంచి రోజులు
కాంగ్రెస్ దోఖాబాజీ పార్టీ అని ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. ఉన్న తెలంగాణను ఊడగొట్టి బలవంతంగా ఆంధ్రాలో కలిపారని, ఫలితంగా తెలంగాణ ఎంతో నష్టపోయిందని గుర్తు చేశారు.
ఆసిఫాబాద్ జిల్లాతో మన్యం బిడ్డలకు మంచిరోజులు వచ్చాయన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే ఆసిఫాబాద్ జిల్లా అయ్యేది కాదన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజీతోపాటు వందల పడకల ఆస్పత్రి కట్టుకున్నామని చెప్పారు. జల్ జంగల్ జమీన్ నినాదమిచ్చిన కొమరం భీమ్ పేరుతోనే ఈ జిల్లాకు నామకరణం చేశామన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. ఆసిఫాబాద్ అభ్యర్థి కోవా లక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
పోడుపట్టాలతో గిరిజనుల జీవితాల్లో వెలుగులు..
ఒక్క ఆసిఫాబాద్ నియోజకవర్గంలోనే 47 వేల ఎకరాలకు పోడు పట్టాలిచ్చామని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. మునపటి లాగా కల్తీనీళ్లు తాగి మరణాలు లేవని, వైద్యం కోసం వందల కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి లేదని, ఏ అవసరం వచ్చినా దగ్గర్లోని జిల్లా కేంద్రంలోనే పరిష్కారమవుతోందని చెప్పారు. ఈ అభివృద్ధి ఇలాగే జరగాలంటే బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రావాలన్నారు కేసీఆర్.
కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని, ఏకంగా గాంధీ భవన్ కి సైతం తాళాలు పడ్డాయని, ఈరోజు టికెట్లు అమ్మినోళ్లు, రేపు రాష్ట్రాన్ని అమ్మేయరా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. టికెట్లు అమ్ముకునే కాంగ్రెస్ నాయకులు కావాలో.. నిత్యం ప్రజల కోసం ఆలోచించే బీఆర్‌ఎస్ నాయకులు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు. డబ్బు సంచులు పట్టుకొని దిగి, నాలుగు రోజులు తమాషా చేసి, మోచేతికి బెల్లం పెట్టి, చాక్లెట్లు, పిప్పర్ మెంట్లు ఇస్తారని, అలాంటివారిని చూసి మోసపోవద్దన్నారు. ఎన్నికలైన తర్వాత వారెవరూ కనపడరని, బీఆర్ఎస్ నేతలు మాత్రమే ప్రజల్లో ఉంటారని చెప్పారు కేసీఆర్.
కాంగ్రెస్ దోఖాబాజీ పార్టీ అని ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. ఉన్న తెలంగాణను ఊడగొట్టి బలవంతంగా ఆంధ్రాలో కలిపారని, ఫలితంగా తెలంగాణ ఎంతో నష్టపోయిందని గుర్తు చేశారు. 2004లో పొత్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ ఇవ్వకుండా మోసం చేశారని, టీఆర్‌ఎస్ ను చీల్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తన ఆమరణ దీక్షతోపాటు, యావత్ తెలంగాణ సమాజం ఉప్పెనలా కదలి పోరాటం చేస్తే గత్యంతరం లేక కాంగ్రస్ తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటుచేసిందని వివరించారు. ఏ పార్టీ ఏం చేసిందో ప్రజలు ఆలోచించుకుని ఓటు వేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్.