Telugu Global
Telangana

మంది మాట పట్టుకొని మార్మానం పోతే..

రైతులకు రోజుకి మూడు గంటలు కరెంటు సరిపోతుందని అంటున్న కాంగ్రెస్ నాయకులు 10హెచ్.పి. మోటర్లు పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారని, ఆ మోటర్లు వీళ్ల అయ్య కొనిస్తాడా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్.

మంది మాట పట్టుకొని మార్మానం పోతే..
X

మంది మాట పట్టుకొని మార్మానం పోతే.. మళ్లొచ్చే వరకు ఇల్లు కాలిపోయిందని పెద్దలు చెప్పారని.. కాంగ్రెస్‌ ను నమ్మి ఓటేస్తే పరిస్థితి అలానే ఉంటుందని అన్నారు సీఎం కేసీఆర్. ఆదిలాబాద్‌ లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మూడేళ్లు కష్టపడి ధరణిని తీసుకువచ్చామని, బాధ్యత లేకుండా దాన్ని తీసివేస్తామంటున్నారని ధరణి తీసేస్తే.. మళ్లీ ఒకరి భూమి మరొకరికి అవుతుందని, కోర్టు కేసులు పెరుగుతాయని, వీఆర్వో వ్యవస్థ వస్తుందని రైతుబంధులో లంచాలు అడుగుతారని చెప్పారు కేసీఆర్. ఏ ఆఫీసుకి వెళ్లకుండా ధరణితో రైతుల అకౌంట్లలో డబ్బులు వచ్చిపడుతున్నాయని, కాంగ్రెస్ వాళ్లు ధరణిని తీసివేస్తే మొదటికే మోసం వస్తుందన్నారు. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లవుతుందని చెప్పారు.


వీళ్ల అయ్య కొనిస్తాడా..?

రైతులకు రోజుకి మూడు గంటలు కరెంటు సరిపోతుందని అంటున్న కాంగ్రెస్ నాయకులు 10హెచ్.పి. మోటర్లు పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారని, ఆ మోటర్లు వీళ్ల అయ్య కొనిస్తాడా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఇది పెద్ద ప్రమాదానికి సంకేతం అన్నారని, పొరపాటున కాంగ్రెస్ నాయకులకు ఓట్లు వేస్తే.. కరెంటు కట్ అవుతుందని, అదేంటని ప్రశ్నించేందుకు కూడా రైతులకు హక్కు ఉండదన్నారు. చావునోట్లో తలకాయపెట్టి తెచ్చుకున్న తెలంగాణను ఇలాంటివారి చేతుల్లో పెడదామా అని ప్రశ్నించారు.

కరెంటు కావాల్నా? కాంగ్రెస్‌ కావాల్నా?.. రైతుబంధు కావాల్నా? రాబందు కావాల్నా? ఏది కావాలో నిర్ణయం చేయాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. గ్రామాల్లో ఈ విషయాలపై చర్చ పెట్టాలన్నారు. మనం ఎవరికి ఓటు వేస్తున్నాం, వారి వెనక ఏ పార్టీ ఉంది, ఆ పార్టీ ఎలాంటిది అని ఆలోచించాలన్నారు. ఆ పార్టీ గుణగణాలేంటి అని ఆలోచించి ఓటు వేయాలన్నారు కేసీఆర్. ఓటు వేరేవారికి వేసి జోగురామన్నను పని చేయమంటే ఎట్లా చేస్తాడని ప్రశ్నించారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఏం జరుగుతుంది..? మనకోసం ఎవరు యుద్ధం చేస్తారో వారి చేతిలోనే కత్తిపెడితే కథ నడుస్తుందన్నారు కేసీఆర్.

First Published:  16 Nov 2023 8:10 PM IST
Next Story