Telugu Global
Telangana

నామినేషన్లపై కేసీఆర్ సంతకాలు..

సుముహూర్తంలో నామినేషన్ పేపర్లపై సంతకాలు చేసిన సీఎం కేసీఆర్ కు అర్చక స్వాములు ఆశీర్వచనాలు అందించారు. విజయోస్తు అని దీవించారు.

నామినేషన్లపై కేసీఆర్ సంతకాలు
X

నామినేషన్లపై కేసీఆర్ సంతకాలు

నామినేషన్ పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకాలు పెట్టారు. గజ్వేల్, కామారెడ్డిలో ఆయన ఈనెల 9న నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో అప్పటికే సిద్ధమైన పేపర్లపై ఆయన సంతకాలు పెట్టారు. ఈ కార్యక్రమం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగింది. ఈ ఉదయం సీఎం కేసీఆర్ కోనాయిపల్లిలోని వెంటకేశ్వర స్వామి ఆలయానికి నామినేషన్ పత్రాలతో సహా వచ్చారు. వాటిని స్వామివారి ముందు ఉంచి పూజలు చేయించారు. అనంతరం అర్చకులు వాటిని తిరిగి సీఎం కేసీఆర్ కి అందించారు. ఆ పత్రాలపై అక్కడే కేసీఆర్ సంతకాలు చేశారు.


సిద్ధిపేట జిల్లాలోని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం సీఎం కేసీఆర్‌, పార్టీకి సెంటిమెంట్‌ గా ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్క డ పూజలు చేసిన తర్వాతే సీఎం కేసీఆర్‌ నామినేషన్‌ వేసేవారు. కేసీఆర్‌, హరీష్ రావు సహా కొంతమంది ఇతర నేతలు కూడా ఎన్నికల సమయంలో ఇక్కడి వెంకన్నను దర్శించుకుని, స్వామివారి సన్నిధిలో నామినేషన్‌ పత్రాలు ఉంచి పూజలు చేయడం ఆనవాయితీ. ఈసారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగింది.

అర్చకుల ఆశీర్వాదం..

సుముహూర్తంలో నామినేషన్ పేపర్లపై సంతకాలు చేసిన సీఎం కేసీఆర్ కు అర్చక స్వాములు ఆశీర్వచనాలు అందించారు. విజయోస్తు అని దీవించారు. ఇక్కడ ఆలయంలో పూజలు చేసి పని మొదలు పెట్టిన ప్రతిసారీ కేసీఆర్ కి విజయం దక్కిందని, ఈసారి కూడా ఆయన విజయం ఖాయమని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు లాంఛనంగా స్వామివారి ముందు నామినేషన్ పత్రాలు ఉంచిన కేసీఆర్.. 9వతేదీ వాటిని ఆయా నియోజకవర్గాల్లోని ఆర్వో ఆఫీసుల్లో సమర్పిస్తారు.


First Published:  4 Nov 2023 1:40 PM IST
Next Story