ఎఫ్ఆర్వో హత్యపై సీఎం కేసీఆర్ సీరియస్.. రూ. 50 లక్షల పరిహారం
ప్రత్యర్థులు మారణాయుధాలతో విరుచుకపడటంతో సెక్షన్ అధికారి రామారావు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోయారు. కానీ, వారికి శ్రీనివాసరావు దొరకడంతో ఆయనపై విచక్షణా రహితంగా దాడి చేశారు.
పోడు భూములను రక్షించే క్రమంలో ఓ అటవీ రేంజ్ అధికారి (ఎఫ్ఆర్వో) హత్యకు గురైన సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలో మంగళవారం ఈ హత్య జరిగింది. ఎర్రబోడు సమీపంలో అటవీ శాఖ నాటిన మొక్కలను కొందరు తొలగిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. పోడు భూముల సాగుదారులే వాటిని తొలగిస్తున్నట్లు తెలుసుకొని ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు, అటవీ సెక్షన్ అధికారి రామారావు అక్కడకు చేరుకున్నారు. వాళ్లను చూసిన వెంటనే సాగుదారులు ఒక్కసారిగా కత్తులు, గొడ్డళ్లతో దాడికి ప్రయత్నించారు.
ప్రత్యర్థులు మారణాయుధాలతో విరుచుకపడటంతో సెక్షన్ అధికారి రామారావు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోయారు. కానీ, వారికి శ్రీనివాసరావు దొరకడంతో ఆయనపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఒక కత్తి వేటు మెడపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. తొలుత చండ్రుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో ఖమ్మంలోని ప్రభుత్వ వైద్యశాలకు అంబులెన్సులో తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. ఈ ఘటనతో మండలంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడి చేసిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.
మానవత్వం చాటుకున్న సీఎం కేసీఆర్..
పోడు భూముల ఘటనలో ఎఫ్ఆర్వో శ్రీనివాసరావును హత్య చేయడంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులందరూ ఎలాంటి జంకు లేకుండా తమ విధులు నిర్వర్తించాలని సీఎం భరోసా ఇచ్చారు. ఎఫ్ఆర్వో అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు దగ్గర ఉండి చూసుకొవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.
ఇక చనిపోయిన శ్రీనివాసరావు కుటుంబానికి సీఎం కేసీఆర్ రూ. 50 లక్షల పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. మరణించిన శ్రీనివాసరావు.. విధి నిర్వహణలో ఉంటే ఎలాంటి నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందుతాయో.. అవన్నీ ఆయన రిటైర్మెంట్ ఏజ్ వచ్చే వరకు కుటుంబానికి అందించాలని, పూర్తి వేతనం ఫ్యామిలీకి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఎఫ్ఆర్వో మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు.
దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిజిపి శ్రీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. మరణించిన ఎఫ్.ఆర్.ఓ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియాను సీఎం ప్రకటించారు.
— Telangana CMO (@TelanganaCMO) November 22, 2022