Telugu Global
Telangana

హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌ను భద్రాచలం పంపిన సీఎం కేసీఆర్.. కారణం ఏంటంటే

ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్‌గా పని చేస్తున్న దురిశెట్టి అనుదీప్‌ను వెంటనే భద్రాచలం వెళ్లాలని ఆదేశించారు. అనుదీప్ గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉంది.

హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌ను భద్రాచలం పంపిన సీఎం కేసీఆర్.. కారణం ఏంటంటే
X

హైదరాబాద్ కలెక్టర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన దురిశెట్టి అనుదీప్‌ను సీఎం కేసీఆర్ భద్రాచలం పంపించారు. ఒక జిల్లా కలెక్టర్‌ను మరో జిల్లాకు పంపడంపై ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతంలో కూడా భారీ వర్షాల కారణంగా నీటి మట్టం గంట గంటకూ పెరుగుతూ ప్రమాదకరంగా మారుతున్నది. ఇప్పటికే గోదావరి వరదకు సంబంధించి ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర చర్యలపై సమీక్ష నిర్వహించారు.

భద్రాచలంలో పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని.. అత్యవసర చర్యలు వెంటనే తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం పట్టణంలో ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్న ప్రాంత ప్రజలను వెంటనే తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అంతే కాకుండా వరదలకు సంబంధించి గతంలో సమర్థవంతంగా పని చేసిన అధికారులను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్‌గా పని చేస్తున్న దురిశెట్టి అనుదీప్‌ను వెంటనే భద్రాచలం వెళ్లాలని చెప్పినట్లు తెలుస్తున్నది. అనుదీప్ గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉంది. దీంతో అక్కడకు వెళ్లి.. వరద పరిస్థితలను అంచనా వేయాలని.. దాన్ని బట్టి సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అనుదీప్‌కు సూచించారు.

రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు భారీగా కురువనున్న నేపథ్యంలో మంత్రులు కూడా తమ శాఖల పరిధిలో సమీక్ష జరిపారు. మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పరిస్థితులపై ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు. నగరాలు, పట్టణాల్లో నీళ్లు నిలిచే ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు.చెరువులు, కుంటలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు.

వైద్యారోగ్య శాఖ పరంగా.. అన్ని జిల్లాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి.. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు చెప్పారు. అంటువ్యాధులు, పాము, తేలుకాటు వంటి సంఘటనలు నమోదయ్యే అవకాశం ఉన్నందున.. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సబ్ సెంటర్ నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరకు అత్యవసర సేవల కోసం సిద్ధంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు కోరారు.

First Published:  21 July 2023 8:13 AM IST
Next Story