Telugu Global
Telangana

తొలిరోజు సోలాపూర్ లో బస.. ధర్మన్న సాదుల్ తో కేసీఆర్ భేటీ

ఈరోజు ఉదయం సోలాపూర్ నుంచి పండరీపురం వెళ్తారు కేసీఆర్. అక్కడ విఠోభా రుక్మిణి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రస్తుతం ఆషాడ మాసం సందర్భంగా అక్కడ పెద్ద జాతర జరుగుతోంది.

తొలిరోజు సోలాపూర్ లో బస.. ధర్మన్న సాదుల్ తో కేసీఆర్ భేటీ
X

రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనలో భాగంగా.. తొలిరోజు సోలాపూర్ లో బస చేశారు సీఎం కేసీఆర్. అడుగడుగునా ఆయనకు మహారాష్ట్ర బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. సోమవారం సాయంత్రం సోలాపూర్ చేరుకున్న కేసీఆర్.. ధర్మన్న సాదుల్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ధర్మన్నను సోలాపూర్ పెద్దన్నగా పిలుచుకుంటారు స్థానికులు.

ధర్మన్న సాదుల్ పూర్వీకులు కరీంనగర్ జిల్లా కన్నాపూర్ కి చెందినవారు. వారి కుటుంబం సోలాపూర్ లో స్థిరపడిన తర్వాత ధర్మన్న సాదుల్ రాజకీయంగా ఎదిగారు. సోలాపూర్ మేయర్ గా పనిచేశారు. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున సోలాపూర్ లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. కొన్నాళ్లుగా కాంగ్రెస్ కి దూరంగా ఉంటున్న ధర్మన్న సాదుల్ ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతల్లో ఆయన కూడా కీలకంగా పనిచేస్తున్నారు. ధర్మన్న సాదుల్ కి స్థానికంగా మంచి పట్టు ఉంది, ఆయన కుటుంబానికి స్థానిక పద్మశాలి వర్గంలో మంచి పలుకుబడి ఉంది. అక్కడి రాజకీయాలను ఆయన కేసీఆర్ కి వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో బీఆర్ఎస్ జెండా ఎగిరి తీరుతుందని చెప్పారు ధర్మన్న సాదుల్.

నేటి కార్యక్రమాలు..

ఈరోజు ఉదయం సోలాపూర్ నుంచి పండరీపురం వెళ్తారు కేసీఆర్. అక్కడ విఠోభా రుక్మిణి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రస్తుతం అక్కడ ఆషాడ మాసం సందర్భంగా పెద్ద జాతర జరుగుతోంది. లక్షలాది మంది భక్తులు, అందులో ఎక్కువగా రైతులు వస్తుంటారు. విఠోభా దర్శనం అనంతరం సర్కోలిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ పలువురు నేతలు కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ లో చేరతారు. ఆ కార్యక్రమం అనంతరం తుల్జాపూర్ శక్తిపీఠానికి వెళ్తారు కేసీఆర్. తుల్జా భవాని అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత హైదరాబాద్ కి బయలుదేరుతారు.

First Published:  27 Jun 2023 1:30 AM GMT
Next Story