ఆటో డ్రైవర్లకు సీఎం కేసీఆర్ శుభవార్త..
కరీంనగర్ కి తనకు ఏదో లింకు ఉందని కరీంనగర్ భీముడు కమలాకర్ తనకు చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. కరీంనగర్ వస్తే ఏదో తెలియని వైబ్రేషన్ అని, అందుకే ఈ గడ్డపైనుంచే ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పానని వివరించారు.
తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు మానకొండూరు ప్రజా ఆశీర్వాద సభలో శుభవార్త చెప్పారు సీఎం కేసీఆర్. సంవత్సరానికోసారి ఫిట్ నెస్ సర్టిఫికెట్ కి పెట్టే ఫీజు మాఫీ చేస్తామని చెప్పారాయన. ఫిట్ నెస్ సర్టిఫికెట్ కోసం ఏడాదికోసారి ఆటో డ్రైవర్లు 1200రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, ఇకపై ఆ బాధ ఉండదని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని కరీంనగర్ లో ప్రకటించడం సంతోషంగా ఉందని చెప్పారు.
కరీంనగర్ కి వస్తే ఓ వైబ్రేషన్..
కరీంనగర్ కి తనకు ఏదో లింకు ఉందని కరీంనగర్ భీముడు కమలాకర్ తనకు చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. కరీంనగర్ అమ్మాయినే తాను పెళ్లి చేసుకున్నానని గుర్తు చేసుకున్నారు. కరీంనగర్ వస్తే ఏదో తెలియని వైబ్రేషన్ అని, అందుకే ఈ కరీంనగర్ గడ్డపైనుంచే ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పానని వివరించారు. మోదీ పెంచిన డీజిల్ రేట్లతో ఇబ్బంది పడుతున్న ఆటో కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
మానకొండురూ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ కి భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారు సీఎం కేసీఆర్. పదేళ్లుగా తెలంగాణ సంతోషంగా ఉందని, ఎవరి పని వారు చేసుకుంటున్నారని, మత కల్లోలాలు లాంటివి అసలు లేవని చెప్పారు. ఇప్పటి వరకు వ్యవసాయ రంగాన్ని బాగు చేసుకున్నామని, వైద్య రంగాన్ని మెరుగుపరచుకున్నామని.. ఈసారి ఐదేళ్లలో ఇళ్ల నిర్మాణంపై ఫోకస్ పెడతామని అన్నారు. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో ఇల్లు లేనివారెవరూ ఉండకూడదన్నారు కేసీఆర్. మానకొండూరులో దళితబంధు ఒకేసారి అందరికీ ఇచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు.
♦