పువ్వాడ పూలు కావాలా.. తుమ్మ ముళ్లు కావాలా- కేసీఆర్
ఓడిన వ్యక్తిని పిలిచి మంత్రి పదవి ఇస్తే.. ఆయనే నాకు మంత్రి పదవి ఇచ్చానని చెప్తున్నాడంటూ తుమ్మలకు కౌంటర్ వేశారు కేసీఆర్. చరిత్ర తిరగేసి చూస్తే ఎవరికి ఎవరు ఏం చేశారనేది తెలుస్తుందన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద సభలతో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఖమ్మం బహిరంగ సభలో అభ్యర్థి పువ్వాడ అజయ్‌ని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఖమ్మం బహిరంగ సభలో తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేటీఆర్ టార్గెట్ చేశారు. గత తొమ్మిదన్నరేళ్ల పాలనలో సంక్షేమాన్ని, అభివృద్ధి వివరిస్తూనే ప్రత్యర్థులపై సెటైర్లు వేశారు.
ఖమ్మం నియోజకవర్గ ప్రజలు పువ్వాడను గెలిపిస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడన్నారు కేసీఆర్. పువ్వాడ లాంటి పూలు కావాలో.. తుమ్మ ముల్లు, తుప్పలు కావాలో ఖమ్మం ప్రజలే తేల్చుకోవాలంటూ తుమ్మలనుద్దేశించి ప్రసంగించారు. ఓడిన వ్యక్తిని పిలిచి మంత్రి పదవి ఇస్తే.. ఆయనే నాకు మంత్రి పదవి ఇచ్చానని చెప్తున్నాడంటూ తుమ్మలకు కౌంటర్ వేశారు కేసీఆర్. చరిత్ర తిరగేసి చూస్తే ఎవరికి ఎవరు ఏం చేశారనేది తెలుస్తుందన్నారు. పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు వెళ్లిపోవడంతో ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ అయిందని, ఇక అంతా శుభమే జరుగుతుందన్నారు.
ఇక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సైతం కేసీఆర్ వదల్లేదు. ఆయన పేరు ఎత్తకుండా పరోక్షంగా ఆయనపై విమర్శలు గుప్పించారు. BRS అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఓ అర్బకుడు అన్నాడన్న కేసీఆర్.. ప్రజాస్వామ్యాన్ని వాడేమైనా గుత్తకు తీసుకున్నాడా అంటూ ప్రశ్నించారు.