కూసే గాడిద, మేసే గాడిద.. డీకేపై కేసీఆర్ పంచ్ లు
ధరణి మాత్రమే రైతుల భూములకు భరోసా అని చెప్పారు కేసీఆర్. కాంగ్రెస్ అధికార కోసం ఎదురుచూస్తోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారీ రాజ్యం, పైరవీ కారుల హవా ఉంటుందన్నారు.
ప్రజా ఆశీర్వాద సభల్లో కాంగ్రెస్ నేతలపై విమర్శలతో విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. తన రాష్ట్రంలో ఐదు గంటల విద్యుత్ ఇవ్వలేని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా మనపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కూసే గాడిద వెళ్లి మేసే గాడిదను చెడగొట్టినట్టు డీకే శివకుమార్ నీతులు చెబుతున్నారని.. 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటలు కరెంట్ ఇస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు సృష్టించినా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు కేసీఆర్. సమైక్య పాలకులు చెరువులను నిర్వీర్యం చేశారన్న ఆయన, మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు జీవం పోశామని వివరించారు. అధికారంలో బీఆర్ఎస్ ఉంటేనే 24 గంటల విద్యుత్ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండగగా మారిందన్నారు కేసీఆర్.
ధరణి మాత్రమే రైతుల భూములకు భరోసా అని చెప్పారు కేసీఆర్. కాంగ్రెస్ అధికార కోసం ఎదురుచూస్తోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారీ రాజ్యం, పైరవీ కారుల హవా ఉంటుందన్నారు. రాహుల్ గాంధీకి వ్యవసాయం తెలియదు, ఎద్దు తెలియదని అన్నారు. ఆయన ఏనాడైనా నాగలి పట్టాడా, పొలం దున్నాడా అన ప్రశ్నించారు. ఇక్కడి సన్నాసులు ప్రసంగాలు రాసిస్తే చదువుతున్నారని ఆయనకు వ్యవసాయం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు.
యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలే చూడాలన్నారు. ఆ లక్ష్మీనరసింహుడే మనతో పని చేయించుకున్నారని అన్నారు కేసీఆర్. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని, కరెంటు ఉండదని, చిమ్మచీకటి అయిపోతుందని చాలామంది అన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. ఆలేరులో సాగునీటి వసతులు పెరగడంతో హైదరాబాద్ కు వలస పోయినోళ్లు కూడా ఇప్పుడొచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని గుర్తు చేశారు. కరువుతో అల్లాడిన తెలంగాణ బాగుపడాలనే వ్యవసాయ స్థిరీకరణ జరగాలని నిర్ణయించామని, రైతుబంధు తెచ్చామని చెప్పారు కేసీఆర్. ఇదివరకు 20 ఎకరాల పొలం ఉన్నా కూడా పిల్లనిచ్చేవారు కాదని, అటెండర్ ఉద్యోగం ఉన్నా కూడా అల్లుడిగా చేసుకునేవారని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయిందని.. ఉద్యోగం లేకపోయినా పొలం ఉంటే పిలిచి పిల్లనిస్తున్నారని.. ఆ స్థాయికి తెలంగాణలో పొలాలు, స్థలాల ధరలు పెరిగిపోయాయని చెప్పారు కేసీఆర్. సునీత తన బిడ్డలాగా అని.. ఆమె అడిగిన హామీలన్నీ నెరవేరుస్తానని చెప్పారు.