Telugu Global
Telangana

సీఎం కేసీఆర్ రాకతో.. మునుగోడులో మారిన సీన్

ఇటీవల పార్టీని వీడి బీజేపీలో చేరిన పలువురిని తిరిగి రప్పించారు. మర్రిగూడ, చండూరు మండలాలకు చెందిన లోకల్ లీడర్లు ఏకంగా ప్రగతి భవన్ వచ్చి మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో తిరిగి పార్టీలో చేరారు.

సీఎం కేసీఆర్ రాకతో.. మునుగోడులో మారిన సీన్
X

సీఎం కేసీఆర్ 11 రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం హైదరాబాద్ తిరిగి వచ్చారు. వెంటనే ఆయన మునుగోడు ఉపఎన్నిక ప్రచారంపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఆయన వద్దకు చేరిన ఇంటెలిజెన్స్ రిపోర్టును కూడా క్షణ్ణంగా పరిశీలించిన తర్వాత పలు సూచనలు చేశారు. క్షేత్ర స్థాయిలో లోకల్, నాన్‌లోకల్ లీడర్ల మధ్య సమన్వయం లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ ఉంటున్న లీడర్లతో కలసి పని చేస్తేనే మంచి ఫలితాలొస్తాయని ఆయన చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని ఇతర నాయకులకు చెప్పాలంటూ మంత్రి జగదీశ్ రెడ్డిని ఆదేశించారు.

ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలోని ప్రతీ రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యేను ఇంచార్జిగా నియమించారు. స్థానికంగానే ఉంటూ ప్రచారాన్ని కొనసాగించాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మునుగోడులో ప్రచారం చేస్తున్నారు. అయితే బయట నుంచి అక్కడకు వెళ్లిన ఎమ్మెల్యేలు, లీడర్లు స్థానికంగా ఉండే టీఆర్ఎస్ నాయకులు పట్టించుకోవడం లేదనే ఫిర్యాదు అందింది. ఈ విషయాన్నే కేసీఆర్ గుర్తు చేశారు. మనకు స్థానిక నాయకులే ముఖ్యం. వాళ్లను కలుపుకొని పోవాలని సూచించారు. ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు ఫోన్ చేసి ఇదే విషయాన్ని చెప్పారు.

మునుగోడు ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేలు తన సొంత నియోజకవర్గాల్లో ఎలా అయితే పని చేస్తారో.. అదే విధంగా చిత్త శుద్దితో పని చేయాలని సూచించారు. ప్రచారానికి అవసరమైన నిధులను పార్టీ సమకూరుస్తుందని ఆ విషయంలో ఎలాంటి బాధ పడొద్దని ఆయన చెప్పారు. ఇటీవల టీఆర్ఎస్ నుంచి వలస వెళ్లిన ద్వితీయ స్థాయి లీడర్లు, కార్యకర్తలతో వెంటనే మాట్లాడాలని.. వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పార్టీ నుంచి వలసలు పెరిగితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి.. మన లీడర్లు, కార్యకర్తలను కాపాడుకోవల్సిన బాధ్యత మనదేనని అన్నారు.

సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష తర్వాత మునుగోడు సీన్ మారిపోయింది. అక్కడ ప్రచారం ఉదృతమయ్యింది. అంతే కాకుండా ఇటీవల పార్టీని వీడి బీజేపీలో చేరిన పలువురిని తిరిగి రప్పించారు. మర్రిగూడ, చండూరు మండలాలకు చెందిన లోకల్ లీడర్లు ఏకంగా ప్రగతి భవన్ వచ్చి మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో తిరిగి పార్టీలో చేరారు. ఉపఎన్నికలో కష్టపడి పని చేయాలని, అలా చేస్తే భవిష్యత్‌లో పార్టీ గొప్ప అవకాశాలు ఇస్తుందని జగదీశ్ రెడ్డి వారికి చెప్పారు.

మరోవైపు ఈ నెల 30న చండూరులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు కేసీఆర్ నియోజకవర్గం వైపు చూడలేదు అనే అసంతృప్తి కార్యకర్తల్లో ఉన్నది. చండూరు సభ తర్వాత పార్టీ క్యాడర్‌లో తప్పకుండా ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు. మునుగోడు ఓటర్లు కూడా కేసీఆర్ సభ తర్వాత ఒక నిర్ణయానికి వస్తారని అంచనా వేస్తున్నారు. చండూరు సభ విజయవంతం చేయడానికి, భారీగా జనాలను సమీకరించాలని పార్టీ ఇప్పటికే నాయకులకు ఆదేశాలు జారీ చేసింది.

First Published:  21 Oct 2022 7:20 AM IST
Next Story