Telugu Global
Telangana

ప్రజల భాగస్వామ్యంతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుందాం : సీఎం కేసీఆర్

తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని చాటుతూ.. పండుగ వాతావరణంలో 21 రోజుల పాటు అవతరణ దినోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ప్రజల భాగస్వామ్యంతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుందాం : సీఎం కేసీఆర్
X

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పల్లెపల్లెన ప్రజల భాగస్వామ్యంతో అత్యంత అద్భుతంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని చాటుతూ.. పండుగ వాతావరణంలో 21 రోజుల పాటు అవతరణ దినోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జూన్ 2 నుంచి నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవాలపై సీఎం కేసీఆర్ శనివారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, కార్యచరణ సంబంధిత అంశాలపై కేసీఆర్ పలు సూచనలు చేశారు.

సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ చరిత్రలోనే గొప్ప సందర్భం.. ఒకనాడు అనేక అవమానాలు, అపోహలకు గురైన తెలంగాణ ఇవ్వాళ అత్యద్భుతంగా వెలుగొందుతున్నదని అన్నారు. విద్యుత్, వ్యవసాయంతో పాటు ప్రతీ రంగంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ప్రగతిని నమోదు చేసుకుంటూ పోతున్నదని చెప్పారు. ఇవ్వాళ స్వరాష్ట్రంలో ప్రజలకు ఫలాలు అందుతున్నాయని.. పదేండ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని పల్లెపల్లెన ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

ఒకనాడు కరెంటు కోతలతో.. కారు చీకట్లలో మగ్గిన తెలంగాణ.. నేడు విద్యుత్ రంగాన్ని మహోన్నతంగా తీర్చుదిద్దుకుందని అన్నారు. దీంతో రాష్ట్రమంతా వెలుగులు విరజిమ్ముతున్నాయని చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాము. ఇది ఎంతో కష్టపడితే కాని సాధ్యం కాలేదని కేసీఆర్ చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యంతో కరెంటు లేక తెలంగాణలో ఎక్కడ చూసినా ఇన్వర్టర్లు కనిపించేవి. కానీ ఇవ్వాళ కరెంటు కోతలే లేవు. ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు వివరించాలని కేసీఆర్ చెప్పారు.

కేవలం విద్యుత్ రంగాన్నే కాకుండా వ్యవసాయం, సంక్షేమం, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఐటీ వంటి ప్రతీ రంగంలో అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం సాధించింది. ఈ విషయాలన్నీ ప్రజలకు పలు ప్రసార మాధ్యమాలు, ఇతర మీడియాల ద్వారా వివరించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. స్వరాష్ట్ర సాధన ఫలాలను అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలందరూ మూడు వారాల పాటు ఈ కార్యక్రమాల్లో మమేకం కావాలని కోరారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే పల్లె నుంచి పట్నం వరకు దశాబ్ది ఉత్సవాలు ఆటాపాటలతో పండుగ వాతావరణం నెలకొంటుందని చెప్పారు.

హైదరాబాద్‌లో జూన్ 2 న దశాబ్ది ఉత్సవాల ప్రారంభ వేడుకలను సచివాలయంలో నిర్వహించాలని సీఎం నిర్ణయించిన నేపథ్యంలో సెక్రటేరియట్‌లో స్టేజీ ఏర్పాటు సహా పోలీసుల గౌరవ వందనం స్వీకరణ, జాతీయ జెండా ఎగురవేయడం తదితర అధికార కార్యక్రమాలు ఉండాలని చెప్పారు. ఈ మేరకు ఆయా కార్యక్రమాలు ఎవరెవరు నిర్వహించాలో ఆయా శాఖల అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు సహా రాష్ట్రవ్యాప్తంగా 21 రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాల ఏర్పాట్లపై సీఎం విస్తృతంగా చర్చించారు.

ఈ సమీక్షా కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి.. ఎమ్మెల్సీలు శేరి సుభాశ్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు, తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సీఎంవో కార్యదర్శులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


First Published:  21 May 2023 12:47 AM IST
Next Story