Telugu Global
Telangana

ప్రభుత్వ రైస్ మిల్లులకోసం కమిటీ.. సీఎం కేసీఆర్ సమీక్ష

ప్రభుత్వ ఆధ్వర్యంలో మిల్లుల ఏర్పాటుకి సంబంధించి విధి విధానాల ఖరారు కోసం సీఎం కేసీఆర్ నూతన కమిటీని ప్రకటించారు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ రైస్ మిల్లులకోసం కమిటీ.. సీఎం కేసీఆర్ సమీక్ష
X

తెలంగాణ రైతు సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని, వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే ప్రస్తుతమున్న రైస్ మిల్లులు యధా విధిగా కొనసాగుతూనే, అధునాతన మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు స్థాపించే దిశగా కార్యాచరణ చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రైస్ మిల్లుల సామర్థ్యం కోటి టన్నులు మాత్రమేనని, మరో రెండు కోట్ల టన్నుల వరిధాన్యాన్ని మిల్లింగ్ చేసే దిశగా అధునాతన మిల్లులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మిల్లుల ఏర్పాటుకి సంబంధించి విధి విధానాల ఖరారు కోసం సీఎం కేసీఆర్ నూతన కమిటీని ప్రకటించారు. ఆర్థిక శాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షులుగా ఇతర అధికారులు సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారన్నారు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కేసీఆర్.

పంటకు పెట్టుబడి అందించడం నుంచి ధాన్యాన్ని గిట్టుబాటు ధర చెల్లించి కొనేవరకు దేశంలో మరే రాష్ట్రం చేపట్టని విధంగా రైతు సంక్షేమాన్ని కొనసాగిస్తూ, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు సీఎం కేసీఆర్. రైతుల సంక్షేమం కోసం ఇప్పుడు ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వరి ధాన్యం ఉత్పత్తులు ఎగుమతయ్యేలా చూడాలని, అప్పడు తెలంగాణ వరికి గిరాకీ పెరిగి రైతులు లాభాలు గడిస్తారన్నారు. అదనంగా పండే పంటను దృష్టిలో ఉంచుకుని నూతనంగా అధునాతన మిల్లులు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సటాకె వంటి కంపెనీలతో ఇప్పటికే చర్చించామని చెప్పారు. శనివారం నుంచి కమిటీ ఆధ్వర్యంలో చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆదేశించారు.


3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడితో తెలంగాణ దేశంలోనే నెంబర్-1 స్థానంలో ఉందన్నారు సీఎం కేసీఆర్. గౌరవెల్లి, మల్కపేట, బస్వాపూర్ తదితర ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సాకారంతో రాష్ట్రంలో వరిధాన్యం దిగుబడి మరో కోటి టన్నులకు పెరిగి 4 కోట్ల టన్నులకు చేరుకునే అవకాశాలున్నాయని చెప్పారు. రాష్ట్రంలో నిల్వ వున్న 1.1 కోటి టన్నుల వరిధాన్యం, 4 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకోకుండా ఎఫ్.సి.ఐ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతోందన్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. కేంద్రం, కేంద్ర సంస్థల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడకుండా రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలంటే నూతన మిల్లులు అవసరం అన్నారు. అందుకే అధునాతన మిల్లులు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు సీఎం కేసీఆర్.

First Published:  22 July 2023 6:45 AM IST
Next Story