Telugu Global
Telangana

దక్షిణ తెలంగాణకు పండగ రోజు..

ప్రపంచంలోనే భారీ పంపులతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సిద్ధమైంది. ప్రారంభోత్సవం సందర్భంగా ఈనెల 16న కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సీఎం కేసీఆర్.

దక్షిణ తెలంగాణకు పండగ రోజు..
X

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభమైన రోజు దక్షిణ తెలంగాణకు పండగ రోజు అవుతుందని తెలిపారు సీఎం కేసీఆర్. ఈనెల 16న నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి ఈ వెట్ రన్ ను లాంఛనంగా ప్రారంభిస్తారాయన. ప్రాజెక్ట్ పనులు పూర్తయిన సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు.


ప్రపంచంలోనే భారీ పంపులతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సిద్ధమైంది. ప్రాజెక్ట్ నుంచి 2 కిలో మీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్ లోకి నీటిని ఎత్తిపోస్తారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఈనెల 16న కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సీఎం కేసీఆర్. అదే రోజు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలనుంచి గ్రామ సర్పంచ్ లు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

16న ప్రారంభోత్సవం తర్వాత 17వతేదీ ఎత్తిపోతల జలాలను కలశాలతో సేకరించి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలోని ప్రతి గ్రామంలోని దేవతా విగ్రహాలకు అభిషేకం చేస్తారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి ఓ కొలిక్కి వచ్చినందుకు దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకుందామని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. ఎన్నో మొక్కులు మొక్కితే, దైవకృపతో, ఇంజనీర్ల కృషితో, పాలమూరు ఎత్తిపోతల పథకం సాకారమైందని అన్నారాయన. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేశామన్నారు.

పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అందుతుంది. బంగారు తెలంగాణ లక్ష్యం ఈ ప్రాజెక్ట్ ద్వారా సంపూర్ణం అవుతుందన్నారు సీఎం కేసీఆర్.

First Published:  6 Sept 2023 1:48 PM GMT
Next Story