Telugu Global
Telangana

కొడంగల్‌ కాదు బిడ్డా.. రేవంత్‌ సవాల్‌పై కేసీఆర్‌!

కొందరు కొడంగల్‌కు రా.. కొడవలి పట్టుకుని రా అంటున్నారంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ దమ్మేందో ఇండియా ఇంతా చూసిందని, ఇప్పుడు కొత్తగా చూపించాల్సిన అవసరం లేదన్నారు.

కొడంగల్‌ కాదు బిడ్డా.. రేవంత్‌ సవాల్‌పై కేసీఆర్‌!
X

దమ్ముంటే కొడంగల్‌లో పోటీ చేయాలన్న పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై స్పందించారు సీఎం కేసీఆర్. అచ్చంపేట బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్‌.. కొందరు కొడంగల్‌కు రా.. కొడవలి పట్టుకుని రా అంటున్నారంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ దమ్మేందో ఇండియా ఇంతా చూసిందని, ఇప్పుడు కొత్తగా చూపించాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్‌ దమ్మేందో ఎదురుగా ఉన్న జనాన్ని చూస్తే చాలదా అంటూ అక్కడి ప్రజలనుద్దేశించి అనడంతో ఒక్కసారిగా సభప్రాంగణం కేరింతలతో హోరెత్తింది. నవంబర్‌ 30న దుమ్ము లేపాలని అక్కడి ప్రజలకు సూచించారు కేసీఆర్‌. బ్రహ్మండమైన మెజార్టీతో గువ్వల బాలరాజును గెలిపించాలని కోరారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రైతులకు డబ్బులివ్వడం స్టార్ట్ అయిందన్నారు కేసీఆర్. గతంలో బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు కట్టకుంటే తలుపులు పీక్కుపోయారని, పశువులను కొట్టుకుపోయారని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు రైతులకు రూపాయి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధు రూ. 12 వేలు చేసుకుందామని, ప్రతి సంవత్సరం పెంచుకుంటూ రూ.16 వేలు చేస్తామన్నారు కేసీఆర్. ఓట్ల కోసం దొంగ హామీలివ్వడం తనకు చేతకాదన్నారు కేసీఆర్.

కాంగ్రెస్‌కు అధికారమిచ్చి కర్ణాటకలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు కేసీఆర్. మూడు గంటల కరెంటు చాలక పంటలు ఎండిపోతున్నాయని, ట్యాంకర్లతో పంటలకు నీళ్లు పెట్టుకునే దుస్థితి వచ్చిందన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ కావాలో..మూడు గంటలు కావాలో ఆలోచించుకోవాలన్నారు.

First Published:  26 Oct 2023 4:57 PM IST
Next Story