Telugu Global
Telangana

అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగాన్ని గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్

వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, రోడ్లు వంటి సకల మౌలిక వసతులను మెరుగు పరచడం ద్వారా నేడు తెలంగాణ గుండె నిబ్బరంతో ఉన్నదని అన్నారు.

అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగాన్ని గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్
X

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్థంతి నేడు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ అమరుల త్యాగాన్ని స్మరించుకున్నారు. దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ప్రాణ త్యాగాల పరంపరను స్వయం పాలనలోని ప్రగతి ప్రస్థానంతో నిలువరించగలిగామని సీఎం కేసీఆర్ అన్నారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన గోదావరి నదీలోయ, ఇతర ప్రాంతాలు ఇవ్వాళ కాళేశ్వరం జలాలతో పచ్చని పంట పొలాలతో అలరారుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.

నాటి త్యాగాల ప్రతీకల స్థానంలో కొత్త ప్రగతి ఆనవాళ్లు సంతరించుకున్నాయని చెప్పారు. అమరుల ఆకాంక్షలను నిజం చేస్తూ.. ఉద్యమ లక్ష్యాన్ని సాధించుకుంటూ.. కేవలం తొమ్మిదేళ్ల కాలంలోనే తెలంగాణ సమాజానికి భవిష్యత్ పట్ల ఒక భరోసాను నింపగలిగినట్లు కేసీఆర్ చెప్పారు. అన్ని రంగాలను పునరుజ్జీవింప చేసుకుంటూ.. తెలంగాణను పునర్నిర్మించుకుంటూ సాగుతున్న స్వయం పాలన దేశానికే ఆదర్శంగా నిలవడం వెనుక అమరుల ఆశయాల స్పూర్తి ఇమిడి ఉన్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, రోడ్లు వంటి సకల మౌలిక వసతులను మెరుగు పరచడం ద్వారా నేడు తెలంగాణ గుండె నిబ్బరంతో ఉన్నదని అన్నారు. అభద్రతా భావాన్ని వీడి.. నేడు సబ్బండ వర్గాలు అభివృద్ధి పథంలో పయనిస్తూ సంతోషంతో జీవిస్తున్నారని చెప్పారు. అమరుల ఆశయాల సాధనే అత్యున్నత కర్తవ్యంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ దిశగా చేపట్టిన కార్యచరణతో సత్ఫలితాలు సాధిస్తున్నదని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ అమరుల మహోన్నత త్యాగాలను సమున్నతంగా గౌరవించుకునేందుకు, భవిష్యత్ తరాలు అమరుల త్యాగాల చరిత్రను నిత్యం స్మరించుకునేలా హైదరాబాద్‌లో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అమర జ్యోతిని ప్రజ్వలనం చేసుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.

అమరుల స్మారకం మనకు నిత్య స్పూర్తిని అందిస్తుందని చెప్పారు. దొడ్డి కొమురయ్య త్యాగాన్ని స్మరించుకునే దిశగా ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

First Published:  4 July 2023 8:00 AM IST
Next Story