Telugu Global
Telangana

ఎన్నికల షెడ్యూల్ రాగానే.. బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయనున్న సీఎం కేసీఆర్!

అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ మొదటి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే.. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

BRS Manifesto 2023: ఎన్నికల షెడ్యూల్ రాగానే.. బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయనున్న సీఎం కేసీఆర్!
X

ఎన్నికల షెడ్యూల్ రాగానే.. బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయనున్న సీఎం కేసీఆర్!

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఎన్నికలకు సిద్ధపడుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పరంగా ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇచ్చిన హామీలనే కాకుండా.. అదనంగా మరికొన్ని పథకాలు ప్రవేశపెట్టి.. అమలు చేశారు. ఇక పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయడానికి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ మొదటి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే.. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మేనిఫెస్టోను సిద్ధం చేయడానికి సీనియర్ నాయకులు, నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వారు తయారు చేసే డ్రాఫ్ట్ మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ పరిశీలించిన అనంతరం తుది మేనిఫెస్టోను ఆమోదించి, విడుదల చేయనున్నారు.

2018లో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో పోలింగ్‌కు కేవలం ఐదు రోజుల ముందు మేనిఫెస్టో విడుదల చేశారు. దీంతో ప్రజల్లోకి మేనిఫెస్టోను పూర్తిగా తీసుకొని వెళ్లడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముందస్తు ఎన్నికలు కావడంతో మేనిఫెస్టోను సకాలంలో రూపొందించడానికి సమయం సరిపోలేదు. ఈ సారి షెడ్యూల్‌కు ముందుగానే మేనిఫెస్టోను సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. షెడ్యూల్ రాగానే మేనిఫెస్టోను విడుదల చేస్తే.. మూడు వారాల సమయం ఉంటుంది కాబట్టి.. ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు, రైతు బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ల వంటి ప్రజాదరణ పథకాలను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఈ పథకాలను మరింత మెరుగు పరిచి.. లబ్దిని కూడా పెంచే అవకాశం ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ప్రజల్లో ఆదరణ ఉన్న పథకాలను కొనసాగిస్తూనే.. కొన్ని కొత్త పథకాలు కూడా సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మేనిఫెస్టో విడుదల అయ్యాక దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్లడానికి నాయకులు, కార్యకర్తలు ఎలా పని చేయాలనే విషయంపై కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మీడియా, సోషల్ మీడియా ద్వారానే కాకుండా.. కరపత్రాలు ముద్రించి ఇంటింటికీ చేరేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకొని వెళ్లడానికి క్షేత్ర స్థాయిలో కార్యకర్తలే కీలకం. కాబట్టి, వారికి సరైన దిశానిర్దేశం చేసేలా.. అన్ని జిల్లాల్లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తారని తెలుస్తోంది.

ఇక అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించే బహిరంగ సభల్లో మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను వివరించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ బాధ్యులు కూడా మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. గతంలో సమయం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడటంతోనే ఈ సారి ముందుగా మేనిఫెస్టో ప్రకటించి.. పార్టీలో ఉత్సాహం నింపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

First Published:  1 July 2023 8:30 AM IST
Next Story