ఇవాళ మరో 3 నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలు..!
గడిచిన 9 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది, అవకాశమిస్తే ఏం చేయబోయేది ప్రజలకు వివరిస్తున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థి కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శల డోస్ పెంచుతున్నారు గులాబీ బాస్.
ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్ఎస్ దూసుకుపోతుంది. ఓ వైపు అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తుంటే.. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభలతో జనంలోకి వెళ్తున్నారు. గడిచిన 9 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది, అవకాశమిస్తే ఏం చేయబోయేది ప్రజలకు వివరిస్తున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థి కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శల డోస్ పెంచుతున్నారు గులాబీ బాస్.
ఇవాళ కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు కేసీఆర్. సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డిని గెలిపించాలని బహిరంగ సభ ద్వారా ఆ నియోజకవర్గ ప్రజలను కోరనున్నారు. అనంతరం కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. జుక్కల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా హన్మంతు షిండే బరిలో ఉన్నారు. ఇక స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాన్సువాడలో ఏర్పాటు చేసిన సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగిస్తారు.
ఆదివారం కోదాడ, తుంగతుర్తి, ఆలేరు సభల్లో పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు కేసీఆర్. మంగళవారం దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌లో పర్యటించనున్నారు. నవంబర్ 9 వరకు కేసీఆర్‌కు సంబంధించి షెడ్యూల్‌ను ఇప్పటికే ఫైనల్ చేసింది బీఆర్ఎస్. నవంబర్ 9న కామారెడ్డిలో నామినేషన్ వేసి అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. మొత్తం 100 నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలు ఉండేలా బీఆర్ఎస్ ప్లాన్ చేసింది.