45రోజులు.. 96 సభలు.. అలుపెరగని కేసీఆర్
గరిష్టంగా రోజుకి 4 నియోజకవర్గాల్లో పర్యటించారు సీఎం కేసీఆర్. నామినేషన్ రోజున కూడా ఆయన బహిరంగ సభకు హాజరయ్యారు. వ్యూహాత్మకంగా రెండు విడతలుగా ప్రచార పర్వం చేపట్టారు కేసీఆర్.
తెలంగాణ సీఎం కేసీఆర్ కి వచ్చే ఫిబ్రవరికి 70 ఏళ్లు వస్తాయి. ఈ వయసులో కూడా ఆయన ఉత్సాహం ముందు యువకులు బలాదూర్. తెలంగాణ ఎన్నికల కోసం 45రోజుల క్రితం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద యాత్రలు మొదలు పెట్టారు. మొత్తం 96ప్రాంతాల్లో ఆయన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. హెలికాప్టర్లు మొరాయించినా ఆయన వెనకడుగు వేయలేదు. జోరువానల్లో కూడా ఆయన తన యాత్రలు ఆపలేదు. 45రోజులు నాన్ స్టాప్ గా ప్రచార పర్వంలో పాల్గొంటూ వివిధ నియోజకవర్గాల నేతలతో వ్యూహరచన చేశారు. విజయవంతంగా ప్రచార పర్వాన్ని ముగించారు.
గరిష్టంగా రోజుకి 4 నియోజకవర్గాల్లో పర్యటించారు సీఎం కేసీఆర్. నామినేషన్ రోజున కూడా ఆయన బహిరంగ సభకు హాజరయ్యారు. వ్యూహాత్మకంగా రెండు విడతలుగా ప్రచార పర్వం చేపట్టారు కేసీఆర్. ఎక్కడికక్కడ గతంలో ఉన్న సమస్యలు ప్రస్తావిస్తూ, జరిగిన అభివృద్ధి వివరిస్తూ, అభ్యర్థుల గుణగణాలు విశదీకరిస్తూ.. బీఆర్ఎస్ విజయం ఎంత అవసరమో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు.
అక్టోబర్ 15వ తేదీన హుస్నాబాద్ నియోజకవర్గంలో సెంటిమెంట్ ప్రకారం ఎన్నికల శంఖారావం పూరించారు కేసీఆర్. ఈరోజు తన సొంత నియోజకవర్గం గజ్వేల్ తో ప్రచార కార్యక్రమాలను ముగించారు. నామినేషన్ రోజున తాను పోటీ చేస్తున్న రెండో నియోజకవర్గం కామారెడ్డిలో బహిరంగ సభకు హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని వివరిస్తూ, మేనిఫెస్టోలోని కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేస్తూ, ప్రచారాన్ని కొనసాగించారు కేసీఆర్. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు వస్తాయని చెప్పారు. బీజేపీ తమకు పోటీయే కాదన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన, చేస్తున్న అన్యాయాన్ని ప్రతి సభలోనూ వివరించారు. ఇందిరమ్మ రాజ్యం అవసరం లేదని, ఆ రాజ్యంలో అన్నీ కష్టాలేనని చెప్పారు కేసీఆర్.