Telugu Global
Telangana

గజ్వేల్ లో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్..

త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆర్వో కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు సీఎం కేసీఆర్. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు. గజ్వేల్ లో కేసీఆర్ నామినేషన్ వేయడం ఇది మూడోసారి.

గజ్వేల్ లో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్..
X

సీఎం కేసీఆర్ గజ్వేల్ నామినేషన్ ఘట్టం పూర్తయింది. ఎర్ర‌వ‌ల్లి నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌ లో ఈ ఉదయం గ‌జ్వేల్‌ కు వెళ్లారు కేసీఆర్. త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆర్వో కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు. గజ్వేల్ లో కేసీఆర్ నామినేషన్ వేయడం ఇది మూడోసారి.


గజ్వేల్ లో నామినేషన్ వేసిన అనంతరం సీఎం కేసీఆర్ వెంటనే హెలికాప్టర్ లో కామారెడ్డి బయలుదేరారు. అక్కడ కూడా ఈరోజే ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం అక్కడ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు కేసీఆర్. కామారెడ్డిలో ఆయన తొలిసారి పోటీ చేయబోతున్నారు. కామారెడ్డి ప్రజలకు ఆయన ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తిగా మారింది. కేసీఆర్ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున స్థానిక నేతలు తరలి వచ్చారు.

నామినేషన్ పత్రాలను సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో ఉంచి శనివారం కేసీఆర్ పూజలు చేసిన సంగతి తెలిసిందే. అదేరోజు నామినేషన్ పత్రాలపై ఆలయ ప్రాంగణంలోనే ఆయన సంతకాలు చేశారు. వాటిని ఈరోజు రెండు చోట్ల దాఖలు చేస్తున్నారు కేసీఆర్. కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేసిన తర్వాత ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా దిగ్విజయంగా పూర్తవుతుందనే సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ప్రకారమే ఈసారి రెండు నామినేషన్ పత్రాలను ఆలయంలో ఉంచి పూజలు చేశారు. అక్కడే వాటిపై సంతకాలు చేశారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి రేపటితో నామినేషన్ ఘట్టం ముగుస్తుంది.


First Published:  9 Nov 2023 6:27 AM GMT
Next Story