Telugu Global
Telangana

రాబోయేది సంకీర్ణ యుగం.. అవకాశాలు మనవే

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేసిందని, ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని, అలాంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దన్నారు కేసీఆర్.

రాబోయేది సంకీర్ణ యుగం.. అవకాశాలు మనవే
X

2024 తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే అధికారాన్ని చేపడతాయని, ఏక పార్టీ మెజార్టీ ఇక ఉండబోదని చెప్పారు సీఎం కేసీఆర్. అన్ని ఎంపీ స్థానాల్లో గెలుచుకుంటే బీఆర్ఎస్ తడాఖా ఢిల్లీలో చూపిస్తామన్నారు. నిజామాబాద్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన గణేష్ గుప్తాని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆయన పేదవారు కాదని, డబ్బులు ఆయనకు అవసరం లేదని, కేవలం తన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు కేసీఆర్. ఈ సభలో ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొన్నారు.


నిజామాబాద్ నగరం ఇప్పుడు సుందరంగా తయారైందని అన్నారు సీఎం కేసీఆర్. 24 గంటల హై కరెంటు ఇస్తున్నామి.. అందుకే ఐటీ హబ్‌లు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. తలసరి ఆదాయంలో ఇండియాలోనే తెలంగాణ నెంబర్-1 స్థానంలో ఉందని చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంధకారమే మిగులుతుందన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.

బాబ్రీ మసీదును కూల్చి వేసింది ఎవరని ప్రశ్నించారు కేసీఆర్. నిజామాబాద్‌ లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారని, 9 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో మైనారిటీలకు ఐటీ సెక్టార్లు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హిందూ ముస్లిం తేడా లేకుండా అందరం కలిసి పని చేద్దామన్నారు. ప్రేమానురాగాలతో కలిసి జీవిద్దామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేసిందని, ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని, అలాంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దన్నారు కేసీఆర్.

First Published:  15 Nov 2023 4:27 PM IST
Next Story