ఈసీ అనుమతితో హెలికాప్టర్ మారింది..
ముఖ్యమంత్రికి కొత్త హెలికాప్టర్ కావాలంటే క్షణాల్లో సిద్ధమవుతుంది. కానీ ఇది ఎన్నికల సీజన్, ప్రతి విషయం ఎన్నికల సంఘం పరిధిలోనే ఉంటుంది. ప్రచారానికి ఉపయోగించే వాహనాలయినా, సభలు, సమావేశాల కోసం అయినా ముందుగా అనుమతి తప్పనిసరి.
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 15న హుస్నాబాద్ సభతో తొలి విడత ప్రచార పర్వాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. ప్రతి రోజూ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి రెండు లేదా మూడు సభలకు ఆయన హాజరవుతున్నారు. ఆ తర్వాత తిరిగి అక్కడికే చేరుకుంటారు. ఈ ప్రయాణమంతా హెలికాప్టర్ ద్వారానే జరుగుతోంది. అయితే ఆ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య అనే సరికి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కేసీఆర్ కి ఏమైంది అని ఆందోళన చెందారు. కానీ పైలెట్ సమయస్ఫూర్తితో ప్రమాదం తప్పింది. సాంకేతిక సమస్య మొదలవగానే రిస్క్ చేయకుండా పైలెట్ వెంటనే హెలికాప్టర్ ని వ్యవసాయ క్షేత్రంలోనే కిందకు దింపారు. ఆ తర్వాత కొత్త హెలికాప్టర్ వచ్చిన తర్వాత తిరిగి తన ప్రయాణం ప్రారంభించారు కేసీఆర్.
ఆ మధ్యలో ఏం జరిగింది..?
ముఖ్యమంత్రికి కొత్త హెలికాప్టర్ కావాలంటే క్షణాల్లో సిద్ధమవుతుంది. కానీ ఇది ఎన్నికల సీజన్, ప్రతి విషయం ఎన్నికల సంఘం పరిధిలోనే ఉంటుంది. ప్రచారానికి ఉపయోగించే వాహనాలయినా, సభలు, సమావేశాల కోసం అయినా ముందుగా అనుమతి తప్పనిసరి. అందుకే కేసీఆర్ కొత్త హెలికాప్టర్ కోసం ముందుగా ఈసీ అనుమతి తీసుకున్నారు. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే కొత్త హెలికాప్టర్ గాల్లోకి ఎగిరింది.
హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో దాన్ని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే ఉంచారు. కేసీఆర్ ఈరోజు షెడ్యూల్ వాయిదా పడుతుందేననే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ సీఎం పర్యటన కొనసాగించడానికే మొగ్గు చూపారు. దీంతో కొత్త హెలికాప్టర్ ను సివిల్ ఏవియేషన్ అధికారులు సమకూర్చారు. దాన్ని వ్యవసాయ క్షేత్రానికి చేర్చారు. అక్కడినుంచి సీఎం కేసీఆర్ దేవరకద్రకు చేరుకున్నారు. దేవరక్రద, నారాయణపేట, మక్తల్, గద్వాల్ నియోజకవర్గాల్లో ఈరోజు సభలు ఉన్నాయి.