Telugu Global
Telangana

పండబెట్టి తొక్కేవాళ్లకి ఓటు వేస్తారా..?

కోమ‌టిరెడ్డి ప్ర‌గల్భాలు స్థానికులకు బాగా తెలుసని చెప్పారు కేసీఆర్. వాళ్లకు డ‌బ్బు అహంకారం ఉందన్నారు.

పండబెట్టి తొక్కేవాళ్లకి ఓటు వేస్తారా..?
X

న‌కిరేక‌ల్ లో మేం గెలిచిన త‌ర్వాత రామ‌న్న‌పేట నుంచి న‌కిరేక‌ల్ దాకా అంద‌ర్నీ పండబెట్టి తొక్కుతామంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతున్నారని, అలా పండ‌బెట్టి తొక్కేటోళ్లు ఎమ్మెల్యేలు కావాలా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. వీళ్లేనా మన ఎమ్మెల్యేలు, వీళ్లేనా మ‌న‌కు కావాల్సింది.. అని నల్గొండ ప్రజా ఆశీర్వాద సభలో ప్రజల్ని అడిగారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌లో ఉండేవాళ్లు, పొద్దన లేస్తే ప్రజల మ‌ధ్య‌లోనే తిరిగేవాళ్లు ఎమ్మెల్యేలుగా గెలవాలని చెప్పారు. కంచర్ల భూపాల్ రెడ్డికి మరోసారి ఘన విజయం అందించాలని ప్రజలకు సూచించారు.


భూపాల్ రెడ్డి 2014 ఎలక్షన్ లో ఓడిపోయినా నల్గొండ వదిలిపెట్టి వెళ్లలేదని, 2018లో గెలిచినా ప్రజల మధ్యే ఉన్నారని అలాంటి వాళ్లను ప్రజలు గెలిపించాలని సూచించారు సీఎం కేసీఆర్. నల్గొండ ప‌ట్ట‌ణంలో మేధావులు, చ‌దువుకున్న వాళ్లు, ఉద్యోగ‌స్తులు ఉంటారని.. వారందరూ పట్టణ అభివృద్ధిని ఓసారి బేరీజు వేసుకోవాలని చెప్పారు. నల్గొండ రూపు రేఖలు మారాయని, బ్ర‌హ్మాండ‌మైన అభివృద్ధి కనపడుతోందని, ఈ అభివృద్ధిని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జార‌విడుచుకోవ‌ద్దని కోరారు.

కోమ‌టిరెడ్డి ప్ర‌గల్భాలు స్థానికులకు బాగా తెలుసని చెప్పారు కేసీఆర్. వాళ్లకు డ‌బ్బు అహంకారం ఉందన్నారు. నల్గొండ నియోజ‌క‌వ‌ర్గం ఇంకా తన ద‌త్త‌త‌లోనే ఉందని చెప్పారు. తన డ్యూటీ, భూపాల్ రెడ్డి డ్యూటీ అయిపోలేదని, ఇప్పుడు చూస్తున్న దాని కంటే ఎన్నో రెట్లు అభివృద్ధి జ‌రుగుతుందని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాలు చెప్పే క‌ల్ల‌బొల్లి మాట‌లు న‌మ్మి గంద‌ర‌గోళ‌మైతే న‌ష్ట‌పోయేది మీరేనని ప్రజలకు వివరించారు కేసీఆర్.

First Published:  20 Nov 2023 9:59 PM IST
Next Story