మారిన షెడ్యూల్.. మెదక్ జిల్లాలో కేసీఆర్ టూర్ ఎప్పుడంటే!
ఈనెల 19వ తేదీన మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 19న మెదక్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. విస్తృత స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా కేసీఆర్ పర్యటన పోస్ట్ పోన్ అయ్యింది. ఈనెల 23న మెదక్ జిల్లాలో కేసీఆర్ పర్యటనకు తాజా షెడ్యూల్ ఖరారైంది.
కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన వాయిదాకు వాతావరణ పరిస్థితులే కారణంగా నిలిచాయి. ఈనెల 19వ తేదీన మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఈ కారణంగానే సీఎం టూర్ విషయంలో పునరాలోచనలో పడిన ఉన్నతాధికారులు మరో షెడ్యూల్ ఖరారు చేశారు.
ఈ విషయాన్ని ఖరారు చేస్తూ మెదక్ కలెక్టర్ రాజర్షి షా.. ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈనెల 23న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. ఈ సందర్బంగా కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ప్రారంభించనున్న కేసీఆర్, తర్వాత బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మెదక్ జిల్లా పోలీసులు, ఉన్నతాధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుకోకుండా వర్షం కురిసినా ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.