Telugu Global
Telangana

తుల్జా భవానిని ఏం కోరుకున్నానంటే..? -కేసీఆర్

అమ్మవారు స్వయంగా పిలిపించుకుంటే తప్ప ఆమె దర్శనం సాధారణంగా జరిగేది కాదని సీఎం తెలిపారు. ఆలయ అధికారులు సీఎం కేసీఆర్ కి సాంప్రదాయ తలపాగను ధరింపజేశారు.

తుల్జా భవానిని ఏం కోరుకున్నానంటే..? -కేసీఆర్
X

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన ముగిసింది. మంగళవారం ఉదయం విఠోబా మందిరాన్ని దర్శించుకున్న కేసీఆర్, సాయంత్రం తుల్జా భవాని అమ్మవారి సేవలో పాల్గొన్నారు. విఠోబా, తుల్జా భవాని దర్శనం తనకెంతో ఆనందాన్నిచ్చిందని చెప్పారాయన. ఇది తమకు దక్కిన అదృష్టం అని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని వారిని కోరుకున్నట్టు తెలిపారు కేసీఆర్. అమ్మవారు స్వయంగా పిలిపించుకుంటే తప్ప ఆమె దర్శనం సాధారణంగా జరిగేది కాదని సీఎం తెలిపారు. ఆలయ అధికారులు సీఎం కేసీఆర్ కి సాంప్రదాయ తలపాగను ధరింపజేశారు. శాలువాతో సత్కరించి అమ్మవారిని ప్రతిమ బహూకరించారు.


వారికెందుకు బాధ..?

తన పర్యటనలో తానెవర్నీ విమర్శించలేదని, ఎవరి పేరు ప్రస్తావించలేదని, అయినా కూడా మహారాష్ట్ర నాయకులు ఆవేశపడుతున్నారని, ఉక్రోశంతో మాట్లాడుతున్నారని అన్నారు కేసీఆర్. అసలు వారికెందుకా బాధ అని ప్రశ్నించారు. దేశంలో ప్రకృతి వనరులు సకల సంపదలు ఉన్నాకూడా, రైతాంగానికి సాగునీరు, సామాన్యులకు తాగునీరు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలు లేక కష్టాలు పడుతున్నారన్నారని చెప్పారు కేసీఆర్. ఆ పరిస్థితులను మార్చేందుకే బీఆర్ఎస్ పుట్టిందన్నారు. మహారాష్ట్ర గ్రామీణ కమిటీల్లో ఇప్పటికే 11 లక్షల మంది సభ్యులుగా చేరారని, ఆ సంఖ్య 35 లక్షలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ విస్తరిస్తుందని, ప్రతి గ్రామంలో 9 కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

కిసాన్ సర్కార్..

దేశంలో భిన్నమైన ఆలోచనలు చేయకపోతే, మార్పు దిశగా ప్రయాణం మొదలు కాకపోతే.. సంక్షేమం, అభివృద్ధి సాధ్యం కాదన్నారు సీఎం కేసీఆర్. దేశంలో అందుబాటులో ఉన్న బొగ్గుని, విద్యుత్‌ ఉత్పాదన కోసం, నదీ జలాలను సాగునీరు, తాగునీరు కోసం, సహజ వనరులను దేశ ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించుకోకపోవడమే అసలు సమస్య అని వివరించారు. ప్రజల దృష్టి మళ్లించడంకోసం బీజేపీ, కాంగ్రెస్‌ చేసే విమర్శలను తాను పట్టించుకోబోనని స్పష్టం చేశారాయన. రైతు సంక్షేమమే ధ్యేయంగా, రైతుల ఆత్మహత్యలు లేని భారతదేశమే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందన్నారు. తామెవరికీ ఏ టీమ్, బీ టీమ్ కాబోమని మరోసారి స్పష్టం చేశారు కేసీఆర్. తుల్జా భవాని దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన హైదరాబాద్ బయలుదేరి వచ్చారు.

First Published:  28 Jun 2023 6:23 AM IST
Next Story