600 వాహనాల కాన్వాయ్‌తో మహారాష్ట్ర బయలుదేరిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1.00 గంటకు ఒమర్గాకు చేరుకుంటారు. అక్కడే భోజనం చేసి.. సాయంత్రం 4.30 గంటలకు షోలాపూర్ చేరుకుంటారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ చేతికి హోం మంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టి, అభినందించారు. ఆ తర్వాత ఆయన ప్రత్యేక బస్సులో మహారాష్ట్రకు బయలుదేరారు. బస్సులో మంత్రులు, ఎంపీలు కూడా ఉన్నారు. ఇక సీఎం బస్సు వెంట 600 వాహనాలు భారీ కాన్వాయ్‌గా బయలు దేరాయి. అందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు.
సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1.00 గంటకు ఒమర్గాకు చేరుకుంటారు. అక్కడే భోజనం చేసి.. సాయంత్రం 4.30 గంటలకు షోలాపూర్ చేరుకుంటారు. ఈ రోజు షోలాపూర్‌లో బస చేస్తారు. ఆ సమయంలో పలువురు బీఆర్ఎస్ నాయకులతో ఆయన సమావేశం అవుతారు. అలాగే తెలంగాణ నుంచి వలస వెళ్లిన చేనేత కుటుంబాలతో కూడా ఆయన మాట్లాడనున్నారు.
మంగళవారం ఉదయం 8 గంటలకు షోలాపూర్ నుంచి పండరీపురం చేరుకుంటారు. అక్కడి విఠోభా రుక్మిణి మందిరంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి ధారాశివ్ జిల్లాలోని తుల్జాభవానీ అమ్మవారి ఆలయానికి వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంగళవారం రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.