Telugu Global
Telangana

మత మౌఢ్యం అత్యంత ప్రమాదకరం : సీఎం కేసీఆర్

మత మౌఢ్యం కలిగి ఉంటే మనుషులు పిచ్చి వాళ్లలాగా తయారవుతారని సూచించారు. మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా మనం పూజించే పరమాత్ముడు ఒక్కడే అని సీఎం కేసీఆర్ అన్నారు.

మత మౌఢ్యం అత్యంత ప్రమాదకరం : సీఎం కేసీఆర్
X

ఆలయం అంటే ఒక సామాజిక స్వాంతన కేంద్రం. ఆలయం అనేది అనేక మతాలవారిని ఐక్యం చేస్తుంది. మతం ఎప్పుడూ మంచిదే.. అయితే మత మౌఢ్యం మాత్రం అత్యంత ప్రమాదకరమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మతం, దేవుడు ఎప్పుడైనా హింసకు వ్యతిరేకమే.. మధ్యలో వచ్చినవాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో శ్రీకృష్ణ గోసేవా మండలి నిర్మించనున్న హెరిటేజ్ టవర్‌ పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇంతటి ఆధ్యాత్మిక వాతావరణంలో మీ మధ్య ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

మత మౌఢ్యం కలిగి ఉంటే మనుషులు పిచ్చి వాళ్లలాగా తయారవుతారని సూచించారు. మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా మనం పూజించే పరమాత్ముడు ఒక్కడే అని సీఎం కేసీఆర్ అన్నారు. మనిషి పుట్టినప్పటి నుంచే పరమాత్ముడిని పూజిస్తున్నాడని చెప్పారు. హరేకృష్ణ ఫౌండేషన్ తమ అక్షయపాత్ర కార్యక్రమం ద్వారా ఎంతో మందికి అన్నదానం చేస్తోంది. ఇది చాలా గొప్ప విషయమని కేసీఆర్ ప్రశంసించారు. హైదరాబాద్‌లోని ఐటీ సెక్టార్ ప్రాంతంలో అన్నపూర్ణ పేరుతో జీహెచ్ఎంసీ, అక్షయపాత్ర కలిసి ఏర్పాటు చేసిన కేంద్రాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ధనవంతులు కూడా వచ్చి భోజనం చేస్తున్నారని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

కరోనా వంటి పాండమిక్ సమయంలో హరేకృష్ణ ఫౌండేషన్ ఎన్నో సేవలు అందించిందని కొనియాడారు. ఎప్పుడు ఆపద వచ్చినా ఈ ఫౌండేషన్ ప్రజలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. హైదరాబాద్ వంటి అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరంలో ఇలా హరేకృష్ణ వారి సారధ్యంలో ఆలయం నిర్మించడం చాలా శుభ పరిణామం అని కేసీఆర్ చెప్పారు. ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 కోట్లు ప్రకటిస్తున్నానని.. ఇవి వెంటనే విడుదల చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

విశ్వశాంతి కోసం మనందరం ప్రార్థించవలసిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. మ్యూజిక్ థెరపీని కూడా చాలా మంది మనశ్శాంతి కోసం ఆశ్రయిస్తున్నారు. అలాంటి కార్యక్రమాలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. భజనలు చేయడం, పాటలు పాడటం మనసుకు ఉల్లాసాన్ని ఇస్తాయని కేసీఆర్ చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించాము. త్వరలో వేములవాడ, కొండగట్టు ఆలయాలు కూడా మరింత వైభోగాన్ని, శోభను సంతరించుకుటాయని సీఎం కేసీఆర్ తెలిపారు.

కాగా, ఐటీ కారిడార్‌ల కోకాపేట-నార్సింగి మధ్య ఉన్న గోష్పాద క్షేత్రంలో 6 ఎకరాల స్థలంలో 40 అంతస్థుల్లో ఈ టవర్ నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.200 కోట్లు ఖర్చు కానున్నది. ఐదేళ్లలో దీని నిర్మాణం పూర్తి చేస్తామని హరేకృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు సత్య గౌర చంద్రదాస తెలిపారు. కాకతీయ, చాళుక్య, ద్రవిడ, ఇతర పురాతన నిర్మాణ శైలుల్లోని వైవిధ్యాలన్నీ ఉపయోగించి ఈ టవర్ నిర్మించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హరేరామ మూవ్‌మెంట్ ఉపాధ్యక్షుడు యజ్ఞేశ్వర దాస ప్రభు, మహావిష్ణ దాస, సీఈవో కౌంతేయ తదితరులు పాల్గొన్నారు.


First Published:  8 May 2023 7:22 AM GMT
Next Story