Telugu Global
Telangana

బంగారు కత్తి ఉందని మెడ కోసుకుంటామా..?

ధరణి పోర్టల్‌ ను తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని విపక్షాలు అంటున్నాయని, వారు అధికారంలోకి వస్తే తిరిగి రైతులకు కష్టాలు తప్పవని హెచ్చరించారు కేసీఆర్.

బంగారు కత్తి ఉందని మెడ కోసుకుంటామా..?
X

పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎప్పుడూ తనతోనే ఉంటారని, ఆయన్ను మీ అభ్యర్థిగా ఎంపిక చేశామని, నియోజకవర్గంలో సమస్యలుంటే తీరకుండాపోయే ప్రసక్తే లేదని చెప్పారు సీఎం కేసీఆర్. పల్లాకు లక్ష మెజార్టీ రావాలని జనగామ సభలో పార్టీ శ్రేణులకు సూచించారు. జనగామ జిల్లాలో మెడికల్‌ కాలేజీతోపాటు నర్సింగ్‌, పారామెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటు కాకముందు కొన్ని జిల్లాలకు వెళ్తే ఏడుపొచ్చేదని, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల పరిస్థితి చూస్తే బాధనిపించేదన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ కు సమీపంలో ఉన్నందున భవిష్యత్‌లో జనగామ అభివృద్ధికి విస్త్రృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు సీఎం కేసీఆర్.


ఆగం కావొద్దు..

ఎన్నికల సమయంలో ఎంతోమంది వస్తుంటారని, ఏవేవో చెబుతుంటారని.. ఆ మాటలన్నీ విని ఆగం కావొద్దని సూచించారు సీఎం కేసీఆర్. ఓటు మన తలరాత మారుస్తుందని, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తోందని, దాన్ని ఆపే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. బంగారు కత్తి ఉందని మెడకోసుకుంటామా అని ప్రశ్నించారు కేసీఆర్. ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దని సూచించారు.

ధరణి పోర్టల్‌ ను తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని విపక్షాలు అంటున్నాయని, వారు అధికారంలోకి వస్తే తిరిగి రైతులకు కష్టాలు తప్పవని హెచ్చరించారు. వ్యవసాయానికి తిరిగి 3గంటలే కరెంటు ఇస్తారని చెప్పారు. కాంగ్రెస్ కి ఓటు వేయొద్దని.. ఆ పార్టీనే బంగాళాఖాతంలో కలపాలన్నారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగానే 93 లక్షల మందికి కేసీఆర్‌ బీమా అమలు చేస్తామని చెప్పారు. రైతుబీమా తరహాలోనే బీమా ఉన్న వ్యక్తి చనిపోతే వారంలోనే రూ.5 లక్షలు వస్తాయని అన్నారు. ఎన్నికల తర్వాత రేషన్‌ కార్డు దారులకు సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.

దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లోనే దళితబంధు లాంటి పథకం పెడితే.. ఈపాటికి దళితుల్లో పేదలు ఎవరూ మిగిలి ఉండేవారు కాదన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ హయాంలో మత ఘర్షణలు, కర్ఫ్యూలు సహజంగా మారిపోయాయని, బీఆర్ఎస్ వచ్చాక ఎక్కడా ఎలాంటి ఘర్షణలు లేవని, అందరూ సోదర భావంతో ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నందువల్లే భారీగా పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టం చేశారు.

First Published:  16 Oct 2023 5:21 PM IST
Next Story