Telugu Global
Telangana

టీఆర్ఎస్ రూట్లోనే బీఆర్ఎస్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ?

దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌ను విస్తరించాలని సీఎం కేసీఆర్ అనేక వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆలోచిస్తున్నారు.

టీఆర్ఎస్ రూట్లోనే బీఆర్ఎస్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ?
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను స్థాపించిన తర్వాత కేసీఆర్ చేసిన మొదటి పని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగడం. ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభకు పోటీ చేస్తే వ్యతిరేక ఫలితాలు రావొచ్చని భావించి.. ఆనాడు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో చెప్పుకోదగిన సీట్లు సాధించారు. ఆ పునాదే.. ఆ తర్వాత కాలంలో టీఆర్ఎస్‌కు పనికి వచ్చింది. ఇక ఇప్పుడు టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్‌గా మారిపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికలపైనే బీఆర్ఎస్ ఫోకస్ చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్‌కు ఎలాగో కారు గుర్తే ఉంటుంది. కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు.

దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌ను విస్తరించాలని సీఎం కేసీఆర్ అనేక వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆలోచిస్తున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామాలు, పట్టణాల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే అక్కడి రైతు, కూలీ, కార్మిక సంఘాలతో పాటు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. గడ్చిరోలి, నాందేడ్, పర్భని జిల్లాలపై బీఆర్ఎస్ ఫోకస్ చేస్తున్నది. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రల్లో రైతు సంఘాల బలోపేతానికి కేసీఆర్ ప్రణాళిక రచించారు. ముందుగా అనుబంధ సంఘాలనే బలోపేతం చేసి.. తద్వారా బీఆర్ఎస్‌ను పటిష్టపరచాలని అనుకుంటున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.

మహారాష్ట్రలో మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికలు మరో రెండు నెలల్లో జరుగనున్నాయి. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మార్చడానికి అప్పటిలోగా ఈసీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రావొచ్చు. కాబట్టి ఆ పార్టీని మహారాష్ట్రలో పరిచయం చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికలే సరైన సమయం అని కేసీఆర్ భావిస్తున్నారు. నాందేడ్ జిల్లాలోని బిలోలి తాలూక గ్రామాలైన కార్ల, గంజ్‌గావ్.. కిన్వత్, మహారో తాలూకా ప్రజలు గతంలో తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ ఏకంగా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల కేసీఆర్ జాతీయపార్టీని ప్రకటించగానే ఈ గ్రామాల్లో ప్రజలు సంబరాలు కూడా చేసుకున్నారు. గడ్చిరోలి, పర్భని, నాందేడ్‌ జిల్లాల్లో తెలుగు ప్రజలు అత్యధికంగా ఉంటారు. అందుకే ఇక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్‌కు ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో చెప్పుకోదగిన సీట్లు లభిస్తే.. భవిష్యత్‌లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేయడం సులభం అవుతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి కొంత మంది స్థానిక నాయకులు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మునుగోడు ఉపఎన్నిక పూర్తయిన తర్వాత మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై సమీక్ష జరిగే అవకాశం ఉన్నది. పార్టీ నేతలు, మహారాష్ట్ర స్థానిక నాయకులు కోరుకుంటే తప్పకుండా పోటీకి దిగే అవకాశం ఉన్నది.

First Published:  8 Oct 2022 2:27 AM GMT
Next Story