సీఎం కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి అవడం ఖాయం: దాసోజు శ్రవణ్
లీడర్-క్యాడర్-కనెక్ట్ అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుందని అన్నారు. అందరం ప్రజలతో మమేకం అయితే ఎన్నికల్లో గెలుపు అంత కష్టమేమీ కాదని శ్రవణ్ పేర్కొన్నారు.
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని.. సీఎం కేసీఆర్ మూడో సారి రాష్ట్రానికి ముఖ్య మంత్రి అవుతారని సీనియర్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని నియోజకవర్గాల్లో నిర్వహించాల్సిన ఆత్మీయ సమ్మేళనాలపై ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పార్టీలోని అందరినీ కలుపుకొని పోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి చర్చించారు.
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. లీడర్-క్యాడర్-కనెక్ట్ అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుందని అన్నారు. అందరం ప్రజలతో మమేకం అయితే ఎన్నికల్లో గెలుపు అంత కష్టమేమీ కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని శ్రవణ్ ధీమా వ్యక్తం చేశారు. ఇక మంత్రి తలసాని మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
గ్రేటర్‌లోని అన్ని డివిజన్లలో ఏప్రిల్ 20 వరకు ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 14న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉంటుందని.. దీనికి హైదరాబాద్ అంతటా సంబరాలు నిర్వహించాలని మంత్రి పేర్కొన్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రతీ డివిజన్‌లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లకు, డివిజన్ బాధ్యులకు సూచించారు.
ఏప్రిల్ 30న కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం ఉంటుందని.. ఆ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. అగస్టు 16న దళిత బంధు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పారు. ఈ నెల 21న గ్రేటర్ సిటీ నేతలతో పార్టీ జనరల్ బాడీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ విస్తృత కార్యక్రమాల సమన్వయం కోసం హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. pic.twitter.com/Dp5izEC1Iz
— Talasani Srinivas Yadav (@YadavTalasani) March 18, 2023