Telugu Global
Telangana

బీజేపీ 'హిందుత్వ' రాజకీయాలను ఎదుర్కునేందుకు డేటా సిద్ధం చేసిన సీఎం కేసీఆర్!

రాష్ట్రంలో ఈ సారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఇతర రాష్ట్రాల్లో చేసిన మాదిరిగానే 'హిందుత్వ' రాజకీయాలను నమ్ముకున్నది.

బీజేపీ హిందుత్వ రాజకీయాలను ఎదుర్కునేందుకు డేటా సిద్ధం చేసిన సీఎం కేసీఆర్!
X

బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఈ సారి కూడా ప్రజలు పట్టం కడతారని కేసీఆర్ విశ్వసిస్తున్నారు. అయితే బీజేపీ నుంచి వస్తున్న విమర్శలు, పోటీని ఎదుర్కోవడానికి తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు. గత 9 ఏళ్లలో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి రాకెట్ వేగంతో దూసుకొని పోయింది. ఐటీ, ఫార్మా, వ్యవసాయ రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును నిర్మించి రికార్డు సృష్టించారు. అన్ని వర్గాల ప్రజల కోసం పథకాలు అమలు చేస్తున్నారు.

రాష్ట్రంలో ఈ సారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఇతర రాష్ట్రాల్లో చేసిన మాదిరిగానే 'హిందుత్వ' రాజకీయాలను నమ్ముకున్నది. కేసీఆర్ ప్రభుత్వాన్ని అభివృద్ధి పరంగా ప్రశ్నించలేక.. గుడి, మతం పేరుతో ఆరోపణలు చేస్తోంది. హిందువులకు కేసీఆర్ చేసింది ఏమీ లేదని పదే పదే చెబుతూ వస్తోంది. వీటన్నింటికీ చెక్ పెట్టడానికి కేసీఆర్ ఒక డేటాను సిద్ధం చేశారు. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి, పూజారుల సంక్షేమం కోసం ఎంత ఖర్చు పెట్టారో గణాంకాలతో సహా అందరికీ చెప్పాలని డిసైడ్ అయ్యారు.

ఇప్పటికే ఆయా వివరాలతో తయారు చేసిన డేటాను మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలకు పంపించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు లెక్కలు మాత్రమే కాకుండా.. పెరిగిన భక్తుల రద్దీ, ఆదాయం వంటి వివరాలను కూడా ప్రజల ముందు ఉంచనున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కోట్ల రూపాయలను ఆలయాల అభివృద్ధి, పూజారుల కోసం ఖర్చు పెట్టింది. బీజేపీ నాయకులు ఎవరైనా దేవాలయం, హిందువులూ అనే మాటలతో విమర్శిస్తే.. ఈ లెక్కలు చెప్పాలని ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు.

యాదాద్రి దేవాలయం పునరుద్దరణ కోసం రూ.1,200 కోట్లు ఖర్చు పెట్టింది. తెలంగాణలో శతాబ్ద కాలం క్రితం నుంచే అతిపెద్ద పుణ్యక్షేత్రంగా ఉన్న యాదాద్రిని.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత సుందరంగా రూపుదిద్దారు. గతంలో రోజుకు 10వేల మంది భక్తులు వస్తే.. సుందరీకరణ తర్వాత 50 వేల మంది ప్రతీ రోజూ సందర్శిస్తున్నారు. ఇక భద్రాచలం రామాలయానికి సీఎం కేసీఆర్ వెళ్లడం లేదని బీజేపీతో పాటు విశ్వహిందూ పరిషత్, ఇతర హిందూ సంస్థలు విమర్శిస్తున్నాయి. అయితే, ప్రతీ ఏడాది భద్రాద్రి దేవాలయానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారో.. దాని అభివృద్ధికి ఏమేం ప్రణాళికలు సిద్ధం చేశారో కూడా తెలియజేయనున్నారు. గత వారం శ్రీరామనవమి సందర్భంగా రూ.1 కోటి ప్రకటించిన విషయాన్ని కూడా తెలియజేయాలని సూచిస్తున్నారు.

ఇప్పటి యాదాద్రి, భద్రాద్రి మాత్రమే కాకుండా ఇతర ప్రముఖ దేవాలయాల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. వేములవాడ ఆలయం కోసం రూ.60 కోట్లు, కొండగట్టుకు రూ.100 కోట్లు, బాసరకు రూ.50 కోట్లు, ధర్మపురి ఆలయం కోసం రూ.50 కోట్లు. భిర్కూర్ ఆలయం కోసం రూ.13 కోట్లు, కొమురవెల్లికి రూ.11 కోట్లు, దుబ్బాక ఆలయం కోసం రూ.3 కోట్లు, సిద్ధిపేట శివాలయానికి రూ.2 కోట్లు మంజూరు చేశారు.

ఇవే కాకుండా ఆలయాల అభివృద్ధి కోసం రూ.390 కోట్లు కామన్ గుడ్ ఫండ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోకి ప్రముఖ దేవాలయాల కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.156 కోట్లు, టెంపుల్ వర్క్ ఫండ్ కింది రూ.1,893 కోట్లు మంజూరు చేశారు. ఆలయాల్లో భక్తులకు సౌకర్యాలు మెరుగు పరచడానికి ఈ నిధిని ఉపయోగిస్తారు. రాష్ట్రంలో ఆదాయం పెద్దగా లేని చిన్న ఆలయాల్లో 'ధూప దీప నైవేద్యం' కోసం రూ.200 మంజూరు చేశారు. వీటన్నింటితో పాటు ఆలయ పూజారులకు, అక్కడ పని చేసే ఉద్యోగులకు భారీగా వేతనాలు ఇస్తున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పాలని సీఎం కేసీఆర్ సూచిస్తున్నారు. రాష్ట్రంలోని ఆలయాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా 1,198 పూజారులు, 1,453 మంది ఇతర ఉద్యోగుల కోసం ప్రత్యేక పథకం ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు. ఈ విషయాలన్నీ ప్రతీ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే, ఇంచార్జీలు, కార్యకర్తలు ప్రజలకు చేరవేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో పాటు.. సోషల్ మీడియాలో కూడా బీజేపీ చేసే ఆరోపణలు, విమర్శలను ఎదుర్కోవడానికి డేటాను ఉపయోగించుకోవాలిన అభిమానులు, కార్యకర్తలకు సూచిస్తున్నారు.

First Published:  1 April 2023 6:06 PM IST
Next Story