Telugu Global
Telangana

సునీతా లక్ష్మారెడ్డికే నర్సాపూర్‌ టికెట్‌.. మదన్‌ రెడ్డికి మెదక్‌ ఎంపీ సీటు..?

2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.

సునీతా లక్ష్మారెడ్డికే నర్సాపూర్‌ టికెట్‌.. మదన్‌ రెడ్డికి మెదక్‌ ఎంపీ సీటు..?
X

నర్సాపూర్‌ బీఆర్ఎస్‌ అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని ఎంపిక చేశారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఈ మేరకు బుధవారం నర్సాపూర్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సమక్షంలో సునీతా లక్ష్మారెడ్డికి బీ-ఫామ్ అందించారు కేసీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌ రావు సైతం పాల్గొన్నారు.

ఇక ప్రస్తుతం నర్సాపూర్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్‌ రెడ్డిని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుండటంతో..ఆ స్థానం నుంచి మదన్‌ రెడ్డిని బరిలో దింపనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్‌.. మదన్‌ రెడ్డితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 35 ఏండ్ల నుంచి మదన్ రెడ్డి తనకు అత్యంత ఆప్తుడిగా కొనసాగుతున్నారని చెప్పారు. మెదక్‌ జిల్లాలో మదన్‌ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అని.. ఆయన సేవలను పార్టీ తప్పనిసరిగా ఉపయోగించుకుంటుందని తెలిపారు.

2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. నర్సాపూర్ స్థానం నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు సునీతా లక్ష్మారెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసిన సునీతా లక్ష్మారెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్ రెడ్డి చేతిలో వరుసగా రెండుసార్లు ఓడిపోయారు.

First Published:  25 Oct 2023 5:10 PM IST
Next Story