Telugu Global
Telangana

కమ్యూనిస్టులతో కలిస్తే లాభమే.. కేసీఆర్‌ది భవిష్యత్ వ్యూహమే.!

ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి కనుక సీపీఐ మద్దతు ఇస్తే తప్పకుండా గెలుస్తుందని కేసీఆర్ అంచనాకు వచ్చారు. అందుకే ప్రగతిభవన్‌లో సీపీఐ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

కమ్యూనిస్టులతో కలిస్తే లాభమే.. కేసీఆర్‌ది భవిష్యత్ వ్యూహమే.!
X

ఉమ్మడి ఏపీలో కమ్యూనిస్టులు చాలా బలమైన శక్తిగా ఉండేవాళ్లు. సీపీఐ, సీపీఎం పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసి గెలవడమే కాకుండా, వాళ్లు మద్దతు ఇచ్చిన పార్టీలను గెలుపుబాట పట్టించేవాళ్లు. అయితే తెలంగాణ ఉద్యమ సమమంలో రెండు కమ్యూనిస్టు పార్టీల సిద్దాంతాలు మారిపోయాయి. ఒకపార్టీ తెలంగాణకు అనుకూలంగా, మరొకటి ఉమ్మడి ఏపీకి మద్దతుగా నిలిచాయి. అక్కడి నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఆ రెండు పార్టీలకు ప్రజల్లో ఆదరణ తగ్గుతూ వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు రెండు సీట్లు గెలిచాయి. ఇక 2018లో అయితే ఒక్క సీటు కూడా గెలవలేదు.

తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలకు చట్టసభల్లో ప్రాతినిథ్యం లేకపోయినా.. క్షేత్ర స్థాయిలో మాత్రం బలమైన క్యాడర్ ఉంది. ఇప్పటికీ వామపక్షాలకు చెందిన విద్యార్థి, ఉద్యోగ, కార్మిక సంఘాలు చురుకుగా పని చేస్తున్నాయి. ఎర్ర జెండా పార్టీలకు ఓట్లేసే సాంప్రదాయ ఓటర్లు కూడా ఇంకా ఉన్నారు. అందుకే ఏ ఎన్నికలు వచ్చినా రాజకీయ పార్టీలన్నీ కమ్యూనిస్టుల మద్దతు కోసం చూస్తుంటాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో కమ్యూనిస్టులు కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితితో కలిసి ఎన్నికల బరిలో నిలిచాయి. పలు చోట్ల కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు గెలవడంలో కమ్యూనిస్టు పార్టీల బలం తోడైందని సర్వేల్లో వెల్లడైంది. ప్రస్తుతానికి సీపీఐ, సీపీఎం ఏ పార్టీతోనూ పొత్తులు కుదుర్చుకోలేదు. అయితే మునుగోడు విషయంలో మాత్రం టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతోంది.

శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సీపీఐ నేతలు చాడా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు భేటీ అయ్యారు. మునుగోడు ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ మద్దతు ఇవ్వడం దాదాపు ఖరారు అయ్యింది. మునుగోడు చరిత్రను తీసుకుంటే ఇక్కడ సీపీఐ ఐదుసార్లు గెలిచింది. 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి సీపీఐ మద్దతు ఇచ్చింది. దీంతో 2014 కంటే 2018లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు పెరిగినా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి మరిన్ని ఓట్లు పోలై.. విజయం సాధించాడు. ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి కనుక సీపీఐ మద్దతు ఇస్తే తప్పకుండా గెలుస్తుందని కేసీఆర్ అంచనాకు వచ్చారు. అందుకే ప్రగతిభవన్‌లో సీపీఐ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

కాగా, కమ్యూనిస్టుల మద్దతు కేవలం మునుగోడు ఉపఎన్నికకే పరిమితం చేయాలని కేసీఆర్ భావించడం లేదు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు ఎలాగైనా టీఆర్ఎస్‌ను గద్దె దించాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ పలు జిల్లాల్లో ప్రభావం చూపగల కమ్యూనిస్టుల మద్దతు తనకు ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టీల మద్దతకు పార్టీకి తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. అవసరం అయితే పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు కేటాయించే అవకాశం కూడా ఉంది. అసలే చట్ట సభల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రాతినిథ్యం తగ్గిపోతున్న సమయంలో.. టీఆర్ఎస్ ద్వారా అయినా ఒకటో, రెండో సీట్లు గెలుచుకోవాలని ఎర్రజెండా పార్టీ నాయకులు భావిస్తున్నారు. కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ పార్టీ కలయిక తప్పకుండా విజయపథంలో నడిపిస్తుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ వంటి మత తత్వ పార్టీకి వ్యతిరేకంగా మరిన్ని పార్టీలు జాతీయ స్థాయిలో మద్దతు ఇవ్వడానికి కూడా కమ్యూనిస్టుల స్నేహం పనికి వస్తుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

First Published:  20 Aug 2022 12:19 PM IST
Next Story