Telugu Global
Telangana

ప్రచారం ముగిసింది.. గజ్వేల్ సభలో కేసీఆర్ ఏం చెప్పారంటే..?

ఫిబ్ర‌వ‌రికి 70ఏళ్లు వస్తాయని.. తనకు పదవులు ముఖ్యం కాదని, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని, తెలంగాణ అద్భుత రాష్ట్రంగా కావాలన్నదే తన తపన అని చెప్పారు కేసీఆర్.

ప్రచారం ముగిసింది.. గజ్వేల్ సభలో కేసీఆర్ ఏం చెప్పారంటే..?
X

సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు గజ్వేల్ తో ముగిశాయి. చివరి రోజు ప్రచారంలో తన నియోజకవర్గ ప్రజలకు వరాలు ప్రకటించారు సీఎం కేసీఆర్. గజ్వేల్ లోని ద‌ళిత కుటుంబాల‌కు ఒకే విడ‌త‌లో ద‌ళిత‌బంధు ఇస్తామని హామీ ఇచ్చారు. గజ్వేల్ లో కాలుష్య రహిత పరిశ్రమలు పెడతామని, ఐటీ టవర్లు తీసుకొస్తామని, మల్లన్న సాగర్ ను టూరిస్ట్ స్పాట్ గా మారుస్తానని చెప్పారు కేసీఆర్.


ఫిబ్ర‌వ‌రికి 70ఏళ్లు వస్తాయని.. తనకు పదవులు ముఖ్యం కాదని, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని, తెలంగాణ అద్భుత రాష్ట్రంగా కావాలన్నదే తన తపన అని చెప్పారు కేసీఆర్. దానికి తగ్గ ఏర్పాట్లు పదేళ్లలో చేసుకున్నామని, ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితేనే ఆ అభివృద్ధి కొనసాగుతుందన్నారు కేసీఆర్. తెలంగాణలో పేదరికం శాశ్వ‌తంగా తొలగిపోవాలని, వంద శాతం అక్ష‌రాస్య‌త ఉండే రాష్ట్రం కావాలని, వైద్య స‌దుపాయాలు ప్ర‌జ‌ల‌కు ఉచితంగా అందుబాటులోకి రావాలని, పేద‌లు లేని తెలంగాణ కావాలని చెప్పారు.

కాంగ్రెస్ పాలనలో మాట్లాడితే క‌ర్ఫ్యూ ఉండేదని, బీఆర్ఎస్ పాలనలో ప‌దేళ్లలో ఒక్క రోజు కూడా క‌ర్ఫ్యూ లేదని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. అన్ని వ‌ర్గాలు, మతాల ప్ర‌జల‌ను సమానంగా చూసుకుంటున్నామని, అందుకే గొడ‌వ‌ల్లేని ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఉందని చెప్పారు. కళ్లు చెదిరే విశ్వ‌న‌గ‌రంగా హైద‌రాబాద్ రూపుదిద్దుకుంటోందన్నారు. తెలంగాణ ఆచ‌రిస్తుంది.. దేశం అనుస‌రిస్తుంది అనేలా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రాన్ని ఒక దరికి తెచ్చుకున్నామని, ఈ రాష్ట్రం ఇంకా బాగుప‌డాలి అని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

సాగునీటి సౌకర్యంతో తెలంగాణలో పంటల ఉత్పత్తి పెరిగిందని, పంటల వైవిధ్యం కూడా పెంచాల్సి ఉందన్నారు కేసీఆర్. రైతు బాగుండాలంటే.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రావాలని, ప్ర‌తి మండ‌లం, ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డిక‌క్క‌డ ఆ ప‌రిశ్ర‌మ‌లు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రైతు బిడ్డ‌లంద‌రికీ అందులో ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. గజ్వేల్ లో తనను రెండుసార్లు గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మూడోసారి కూడా ఆశీర్వదిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరిన్ని మంచి పనులు చేసుకుందామన్నారు కేసీఆర్.

గ‌జ్వేల్‌ కు వరాలు..

హైద‌రాబాద్‌ కు కూత‌వేటు దూరంలో ఉన్న గజ్వేల్ లో స్థలాలు ఇప్పిస్తే ఐటీ టవర్లు పెడతామని చాలామంది ముందుకొస్తున్నారని, మంత్రి కేటీఆర్ కి ఈ విషయాన్ని చెప్పానని, స్థల పరిశీలన మొదలైందని, గజ్వేల్ కు ఐటీ టవర్లు తెచ్చే బాధ్యత తనది అని చెప్పారు కేసీఆర్. ప్ర‌తి మండ‌ల కేంద్రంలో మార్కెట్ యార్డు నిర్మాణాలు చేపడతామన్నారు. మల్లన్న సాగర్ ని టూరిస్ట్ స్పాట్ గా తయారు చేస్తానన్నారు. కాలుష్యం లేని పరిశ్రమలను గజ్వేల్ కి తీసుకొస్తానన్నారు. రాబోయే కాలంలో డ‌జ‌ను ప‌రిశ్ర‌మ‌లు గ‌జ్వేల్‌ కు వ‌స్తాయ‌ని చెప్పారు సీఎం కేసీఆర్.

First Published:  28 Nov 2023 12:02 PM GMT
Next Story