Telugu Global
Telangana

నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను ఆగం కానివ్వను

ఇప్పుడు కొన్ని స్వార్థ, సంకుచిత శక్తులు రాష్ట్రంలో కలుషిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మనకు పచ్చటి పంటలు పండే తెలంగాణ కావాలా? మతపిచ్చి మంటల తెలంగాణ కావాలా? అని సీఎం కేసీఆర్ అన్నారు.

నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను ఆగం కానివ్వను
X

మత పిచ్చి రాజకీయాలు మనకు అవసరమా?

మోడీ ఇలా ఎందుకు చేస్తున్నారు?

దేశంలో ఇలా ఎందుకు జరుగుతుందో ఆలోచించుకోవాలి

బీజేపీ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం

''నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వను. ఒక చిన్న ఏమరుపాటు వల్ల 58 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఏపీలో ఉండిపోయింది. కష్టపడి సాధించుకున్న తెలంగాణ గత 8 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్నది. కానీ ఇప్పుడు కొన్ని స్వార్థ, సంకుచిత శక్తులు రాష్ట్రంలో కలుషిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మనకు పచ్చటి పంటలు పండే తెలంగాణ కావాలా? మతపిచ్చి మంటల తెలంగాణ కావాలా?'' అని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టరేట్ భవనాల సముదాయాన్ని ఆయన గురువారం కొంగరకలాన్‌లో ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ చేస్తున్న మత, సంకుచిత రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక ఇల్లు కట్టాలన్నా.. ఒక ప్రాజెక్టు కట్టాలన్నా.. ఒక రాష్ట్రం ఏర్పడాలన్నా చాలా ఏళ్లు పడుతుంది. కానీ మూర్ఖంగా, మూఢ నమ్మకాలతో వాటిని కూల్చాలంటే రెండు మూడు రోజులు చాలు. అంతా నేల‌మ‌ట్టం అవుతుంది. చెట్టుకొకరు పుట్టకొకరు అవుతారు. గత 40 ఏళ్ల నుంచి ఎన్నో ప్రభుత్వాలు కష్టపడితే బెంగళూరు నగరం సిలికాన్ వ్యాలీగా మారింది. అక్కడ ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. బెంగళూరు తర్వాత హైదరాబాద్ నగరం ఐటీలో దూసుకొని పోతుంది. కానీ గత ఏడాది బెంగళూరు కంటే హైదరాబాదే ఎక్కువ ఐటీ ఉద్యోగాలు ఇచ్చింది. అందుకు కారణం ఏంటో తెలుసా? కర్నాటకలో హిజాబ్ అనీ, హలాల్ అని రకరకాల మత పిచ్చితో గత ఏడాదిగా వాతావరణాన్ని కలుషితం చేయడంతో అక్కడ ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఇదే వాతావరణం హైదరాబాద్‌కు అవసరమా? మన ప్రాజెక్టులు ఆగిపోవాలా.. ఐటీ రంగం పారిపోవాలా.. పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోవాలా.. మన రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పడిపోవాలా అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మన తెలంగాణకు బంగారు కొండ. ఇక్కడ భూముల విలువ ఎంతో ఎక్కువగా ఉంది. మత పిచ్చిలో పడి వాటిని పోగొట్టుకోవాలా? కొంత మంది పనికి మాలిన వాళ్లు.. వారి చిల్లర రాజకీయాల కోసం మతం మంటలు పెడితే, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

మోడీకి ఉన్న పదవి చాలదా?

ఓట్ల కోసం, చిల్లర రాజకీయాల కోసం భారత సమాజాన్ని కష్టపెట్టే పరిస్థితి తెస్తున్నారు. బీజేపీ ఎందుకు ఈ గందరగోళం చేస్తున్నదో ఒక సారి ఆలోచించండి. నరేంద్ర మోడీ ఎందుకు ఆగంఆగం అవుతున్నడు? ఏం కావాలి ఆయనకు.. ఉన్న పదవి చాలదా? ప్రధాని పదవి కంటే పెద్దది ఇంకా ఏమైనా ఉన్నదా? ఇప్పుడు ఎన్నికలు లేవు కదా? మరి ఏం జరుగుతోంది అని కేసీఆర్ ప్రశ్నించారు. బీహార్‌లో ఏం జరుగుతోంది? ఢిల్లీలో, బెంగాల్‌లో ఏం జరుగుతోంది? మన హైదరాబాద్‌లో ఎలాంటి కారుకూతలు కూస్తున్నారో దయచేసి ఆలోచన చేయండి. గత 8 ఏళ్ల నుంచి కఠినంగా వ్యవహరించడం వల్లే చీమ చిటుక్కుమనడం లేదు. హైదరాబాద్ నగరం, తెలంగాణ అంతా ప్రశాంతంగా ఉంది. రాష్ట్రమంతా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతోంది. మన తలసరి ఆదాయం పెరిగింది. జీఎస్‌డీపీ పెరిగింది. మంచినీటి సదుపాయాలు పెరిగాయి. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. కరెంటు ఉత్పత్తి పెరిగింది. కానీ దుర్మార్గులు, మతపిచ్చిగాళ్లు, చిల్లరగాళ్లు ఈ రోజు ఏం చేస్తున్నారు? ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ఆలోచించండి. నేను బ్రతికి ఉండగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వను. ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తాను అని కేసీఆర్ అన్నారు. నాకున్న బలం బలగం మీరే.. మీ అండదండలు, ఆశీర్వచనాలు ఉన్నంత కాలం మరింత ముందుకు వెళ్తాను అని కేసీఆర్ అన్నారు.

మన ఐక్యతను దెబ్బతీయకుండా చూసుకుందాం..

ఎన్నో కష్టాలు పడి రాష్ట్రాన్ని సాధించుకొని అభివృద్ధి చేసుకుంటున్నాము. కానీ మన ఐక్యత దెబ్బతిన్న నాడు, మత శక్తుల పిచ్చికి మనం లోనైన నాడు, మనం చెదిరిపోయిన నాడు మళ్లీ పాత తెలంగాణ లాగా తయారవుతాము. బతుకులు ఆగం అవుతాయి అని కేసీఆర్ హెచ్చరించారు. వీళ్లు ఎక్కడా ఉద్దరించింది ఏమీ లేదు. నేను ఒక్కటే మాట చెప్తాను. పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూపించండి. మన తెలంగాణలో అనేక పథకాలు అమలు అవుతున్నాయి. పచ్చగా ఉన్న తెలంగాణను చూసి.. వాళ్లకు చేతకాక, చేయరాక ఇక్కడ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. ఇలాంటి స్వార్థ, నీచ మతపిచ్చిగాళ్లను ఎక్కడికక్కడ తరమి కొట్టాలి. మనం అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ అన్నారు. మేధావులు, యువకులు, రచయితలు, కవులు, విద్యార్థులను ఒకటే కోరుతున్నా.. పరిస్థితి ఇలాగే ఉంటే, కూర్పు చెడిపోతే, విభజన వస్తే ఒక 100 ఏళ్లు తెలంగాణ, ఇండియా ఆగం అవుతుంది. అసూయ, ద్వేషం పెరిగితే మనకు మంచిది కాదు. ప్రేమ, అనురాగంతో బతికే సమాజం బాగుపడుతుంది. కానీ, కర్ఫ్యూ, లాఠీ చార్జీలు, కోపం, అసహ్యంతో ఉండే సమాజం పురోగమించదు. అలాంటి వాటికి తెలంగాణ బలి కావొద్దని కేసీఆర్ ఆకాంక్షించారు. ఆకుపచ్చని తెలంగాణ మరింత ముందుకు వెళ్లాలని, శాంతియుత తెలంగాణ కావాలని కేసీఆర్ కోరారు. అందరూ చర్చించి.. రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ముందుండాలని కేసీఆర్ అన్నారు.

మోడీకి చేతకాదా?

కృష్ణా జలాల్లో మన వాటాను తేల్చమని కోరితే మన ప్రధాని మోడీకి చేత కావడం లేదు. పైగా ఉల్టా పల్టా మాట్లాడుతున్నడు. ఎనిమిదేళ్ల ఆయనకు సరిపోలేదా అని మండిపడ్డారు. రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు నీళ్లు అవసరం ఉంది. మేం మనుషులం కాదా? భారతదేశంలో భాగం కాదా? అని ప్రశ్నించారు. 100 దరఖాస్తులు ఇస్తే ఈ రోజు వరకు ఉలుకు పలుకు లేదు. సుప్రీంకోర్టులో కేసు వేశాం. దాన్ని విత్‌డ్రా చేస్తే నీళ్లు ఇస్తాం అన్నారు. ట్రిబ్యునల్‌కు చెప్పి జలాల వాటా ఇస్తామని అన్నారు. అందుకే కేసు విత్‌డ్రా చేశాం. కానీ ఈ రోజు వరకు ఉలకూ పలుకూ లేదు.. నీళ్లు రాలేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపితేనే మనం బాగుపడతాం. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో తెలంగాణ ఉద్విగ్నమైన పాత్రను పోషించాలి అని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ దుర్మార్గులను సాగనంపితేనే దేశానికి నిష్క్రుతి, మన రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందని కేసీఆర్ అన్నారు. దుర్మార్గమైన ఈ మత పిచ్చి గాళ్లకు, రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టే వారికి దేశంలో స్థానం లేదన్నారు. ఈ పనికి నేనే ముందుగా జెండా ఎత్తుతానని కేసీఆర్ స్పష్టం చేశారు.

First Published:  25 Aug 2022 7:06 PM IST
Next Story