బీజేపీ ఎంపీలు గడ్డికోస్తున్నారా..?
"తెలంగాణ కోసం బీజేపీ ఎంపీలు నోరు తెరవరు, వారికి అడిగే దమ్ములేదు" అని మండిపడ్డారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ఎంపీలు అడిగినా మోదీ ఇవ్వనే ఇవ్వరన్నారు.
దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు కేంద్రం ఇవ్వలేదని అన్నారు సీఎం కేసీఆర్. నవోదయ పాఠశాలలు కూడా ఇవ్వలేదన్నారు. నవోదయ స్కూల్స్ కోసం 100 ఉత్తరాలు ప్రధాని మోదీకి రాసినా ఉపయోగం లేదన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వలేని బీజేపీ.. ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారాయన. తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలున్నారని, వారంతా ఏం చేస్తున్నారని అడిగారు. గడ్డి కోస్తున్నారా.. అని నిలదీశారు సీఎం కేసీఆర్. బోథ్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన బీజేపీపై మండిపడ్డారు.
"తెలంగాణ కోసం బీజేపీ ఎంపీలు నోరు తెరవరు, వారికి అడిగే దమ్ములేదు" అని మండిపడ్డారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ఎంపీలు అడిగినా మోదీ ఇవ్వనే ఇవ్వరన్నారు. అలాంటి బీజేపీ అభ్యర్థులు తెలంగాణ ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక్క స్కూలు, మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దని చెప్పారు. బోథ్ నియోజకవర్గంలో అనిల్ జాదవ్ ను గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే బోథ్ ను రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్. డిగ్రీ కాలేజీ కూడా మంజూరు చేస్తానన్నారు. కోల్డ్ స్టోరేజీని కూడా తీసుకొస్తానన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని చనకా – కొరటా ప్రాజెక్టు పూర్తి కావొస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. బోథ్ నియోజకవర్గం పరిధిలోని తిప్పల్ కోటి రిజర్వాయర్ కు పెన్ గంగా నీళ్లు తీసుకొస్తే చాలా లాభం జరుగుతుందని, ఆ పని తప్పకుండా చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ టర్మ్‌లో కుఫ్టి రిజర్వాయర్ ను కూడా మొదలుపెట్టించి పూర్తి చేయించే బాధ్యత తనదేనని చెప్పారు. అనిల్ జాదవ్ ప్రజల్లో కలిసుండే వ్యక్తి అని, ఆయన్ను గెలిపిస్తే బ్రహ్మాండంగా బోథ్ నియోజకవర్గంలో కోరిన పనులన్నీ చేసిపెట్టే బాధ్యత తనది అని అన్నారు కేసీఆర్.