Telugu Global
Telangana

మునుగోడులో జరిగేది ఉపఎన్నిక కాదు.. బతుకు ఎన్నిక

తెలంగాణ కోసం ఏమైనా అడిగినా, కేంద్రాన్ని ప్రశ్నించినా బీజేపీ నాయకులు బెదిరిస్తున్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో బీజేపీ.. ఈడీ దాడులు చేయిస్తోంది. కానీ తాను భయపడను అని కేసీఆర్ అన్నారు. ఈడీ వస్తుందో మోడీ వస్తుందో చూద్దామని ఆయన సవాలు విసిరారు.

మునుగోడులో జరిగేది ఉపఎన్నిక కాదు.. బతుకు ఎన్నిక
X

మోడీ వస్తడా.. ఈడీ వస్తదా.. రమ్మను

బీజేపీ మనకు మీటర్లు పెట్టుడు కాదు... మనమే వాళ్లకు మీటర్లు పెడదాం

ఇవో డూప్లికెట్ ఎన్నికలు

అమిత్ షా ఏమైనా సమాధానం చెప్తడా?

మునుగోడు సభలో కేసీఆర్

ఒక వ్యక్తి కోసమో, ఒక పార్టీ కోసమో వచ్చిన ఎన్నిక కాదిది.. తెలంగాణ ప్రజానీకం అంతా మరోసారి ఏకం అవ్వాల్సిన సందర్భంలో వచ్చిన ఎన్నిక అని సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు ఏమిటో మునుగోడు నుంచి ఢిల్లీలో ఉన్న వాళ్లకు తెలపాల్సిన సమయం వచ్చిందని ఆయన చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన 'ప్రజా దీవెన' బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంలో అక్కడ ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ముందుగానే బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కీలకమైన విషయాలను ప్రస్తావించారు.

సీఎం కేసీఆర్ మునుగోడు ప్రసంగం ఇలా..

''రేపు ప్రధాని మోడీ ఒక మాట అంటాడు.. కేసీఆర్.. మునుగోడులో నాకే ఓటేశారు. నువ్వేం చేస్తావు అని అడుగుతడు. మోడీ రాగానే మన రాష్ట్రంలో రైతుల మోటార్లకు మీటర్లు పెడతడు, ఇంటిలో నీళ్లకు మీటర్లు పెడతడు. రేపు మునుగోడులో గెలిపించినా ఇదే మాట అంటడు.. మీటర్లు పెట్టే బీజేపీ కావాల్నా.. మీటర్లు వద్దనే కేసీఆర్ కావాల్నా?.. మనకు బీజేపీ మీటర్లు పెట్టుడు కాదు. రేపు మనమే వాళ్లకు మీటర్లు పెడ్దాం'' అని కేసీఆర్ అన్నారు. రేపు బీజేపీ ప్రభుత్వం వస్తే తెలంగాణ రైతులకు మొత్తం మీటర్లు పెడుతుంది. అలా చెయ్యొద్దని కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాను. అలాంటి సమయంలో మద్దతు ఇవ్వాల్సింది మీరే కదా అని కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం మునుగోడులో జరుగుతున్నవి డూప్లికెట్ ఎలక్షన్స్ అని, ప్రతిపక్షాలు కావాలనే ఈ ఎన్నిక రప్పించాయ‌ని ఆయన అన్నారు.

మునుగోడు ఉపఎన్నిక ఒక మార్పున‌కు చిహ్నం కాబోతోందని కేసీఆర్ స్పష్టం చేశారు. కమ్యూనిస్టు సోదరులు కలసి రావడం మనకు మరింత బలాన్ని ఇస్తుందని సీఎం చెప్పారు. ఈ ఒక్క ఎన్నికకే కాదని... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీపీఐతో పాటు సీపీఎం కూడా మనతో కలసి నడుస్తుందని కేసీఆర్ బహిరంగ సభ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతానికి సీపీఎం బహిరంగంగా మద్దతు ఇవ్వక పోయినా.. రాబోయే ఎన్నికల్లో వారి మద్దతు టీఆర్ఎస్‌కు ఉంటుందని ఆయన చెప్పారు.

తెలంగాణ కోసం ఏమైనా అడిగినా, కేంద్రాన్ని ప్రశ్నించినా బీజేపీ నాయకులు బెదిరిస్తున్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో బీజేపీ.. ఈడీ దాడులు చేయిస్తోంది. కానీ తాను భయపడను అని కేసీఆర్ అన్నారు. ఈడీ వస్తుందో మోడీ వస్తుందో చూద్దామని ఆయన సవాలు విసిరారు. దేశంలోని పరిస్థితులు చూస్తుంటే.. ప్రతీ ఒక్కరు అప్రమత్తగా ఉండాల్సి అవసరం ఉందన్నారు. మత, కుల పిచ్చితో బతకడం అనవసరం అన్నారు. అలాంటి పిచ్చి మనకు మంచిది కాదని కేసీఆర్ చెప్పారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే స్థిరమైన ప్రభుత్వం అవసరం అని ఆయన అన్నారు.

రేపు కేంద్ర మంత్రి అమిత్ షా సభ ఉండటంతో దాన్ని లక్ష్యంగా చేసుకొని మరీ కేసీఆర్ విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా గారూ ఏ ముఖం పెట్టుకొని రేపు మునుగోడు వస్తున్నారో సమాధానం చెప్పండి అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణతో సహా, మునుగోడుకు ఎంత సహాయం చేశారో మీరు చెప్పండి.. మా ప్రభుత్వం కంటే మీరు ఎక్కువ సహాయం చేశారా అని కేసీఆర్ ప్రశ్నించారు. కేవలం మునుగోడుకే కాదు.. తెలంగాణకు మీరు ఎన్ని నిధులు, ప్రాజెక్టులు ఇచ్చారో వెల్లడించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

సీఎం ప్రసంగం కమ్యూనిస్టు నాయకుల స్నేహాన్ని పొగుడుతూ మొదలు పెట్టినా.. చివరకు మోడీ, అమిత్ షాలనే టార్గెట్ చేశారు. గత కొన్నేళ్లుగా తెలంగాణపై కేంద్ర చూపిస్తున్న వివక్షను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

First Published:  20 Aug 2022 6:05 PM IST
Next Story