Telugu Global
Telangana

వీఆర్ఏలకోసం సూపర్ న్యూమరీ పోస్ట్ లు.. సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం

సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏల విద్యార్హతల ప్రకారం, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని తెలిపారు.

వీఆర్ఏలకోసం సూపర్ న్యూమరీ పోస్ట్ లు.. సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం
X

తెలంగాణలో వీఆర్ఏల వ్యవస్థ పూర్తిగా రద్దు చేస్తూ, వారికోసం రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరీ పోస్ట్ లు సృష్టించి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. నీరటి, మస్కూరు, లష్కర్ వంటి పేర్లతో ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ) ఇక తెలంగాణలో కనిపించరు. రాష్ట్రంలోని 20,555 మంది వీఆర్ఏలు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ అవుతారు. వారి విద్యార్హతకు తగ్గట్టు సూపర్ న్యూమరీ పోస్టుల్లో జాయిన్ అవుతారు. 61 ఏళ్లుపైబడిన వీఆర్ఏల వారసులకు, 61 ఏళ్ల లోపు వయసులో చనిపోయిన వీఆర్ఏలకు సంబంధించి వారసులకు కారుణ్య నియామకాలు చేపడతారు.


గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో)కి సహాయకంగా గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ) ఉండేవారు. సాగునీటి వ్యవస్థను గ్రామాల్లో సక్రమంగా నిర్వహించేందుకు, రెవెన్యూ సహాయకులుగా వీరితో పనిచేయించుకునేవారు. జీతం ఉంటుంది కానీ సాధారణ ఉద్యోగుల్లాగా అలవెన్సులు ఉండవు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో సంచలన మార్పులు తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. వీఆర్వోల విధులను పూర్తిగా మార్చేశారు, వారిని ఇతర విభాగాలకు సర్దుబాటు చేశారు. ఇప్పుడు గ్రామ రెవెన్యూ సహాయకుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. మంత్రుల సబ్ కమిటీ సిఫారసుల మేరకు, నిబంధనలను అనుసరించి వీఆర్ఏల విద్యార్హతల ప్రకారం, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తరతరాలుగా సమాజానికి సేవ చేస్తున్న వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయం వారి వ్యక్తిగతంగా మాత్రమే కాదని, ఇది సమాజానికి చేస్తున్న సేవగా భావిస్తున్నామని సీఎం తెలిపారు. అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలతో, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారి కోసం తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఎవరూ అడగకుండానే ఉద్యోగ వర్గాలకు జీతాలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ‘సఫాయన్నా..నీకు సలామన్నా..’ అంటూ ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ కు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు సీఎం కేసీఆర్.

వీఆర్ఏ జేఏసీ హర్షం..

తరతరాలుగా వెంటాడుతున్న సామాజిక వివక్షతో కూడిన విధుల నుంచి తమకు విముక్తి కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేసి, తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సీఎం కేసీఆర్ కి తాము జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు వీఆర్ఏలు. వీఆర్ఏ జేఏసీ నేతలు సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.

First Published:  23 July 2023 10:08 PM IST
Next Story