Telugu Global
Telangana

ఏపీ నుంచి రూ.17,828 కోట్లు రావాలి.. తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తా: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఏపీ నుంచి రావల్సిన విద్యుత్ ఆగిపోయింది. అప్పట్లో మన వద్ద 7 వేల మెగా వాట్లు మాత్రమే ఉండేది. కానీ ఇవ్వాళ 17 వేల మెగావాట్లకు పెంచుకున్నామన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో 4 వేల మెగావాట్ల ఎన్డీపీసీని తెలంగాణ ప్రాంతంలో నెలకొల్పాలని ప్రతిపాదనలు ఉన్నాయి. నేటికి నాలుగు మెగావాట్లు కూడా ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపించారు.

ఏపీ నుంచి రూ.17,828 కోట్లు రావాలి.. తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తా: సీఎం కేసీఆర్
X

తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. మోడీ ప్రభుత్వం తెలంగాణపై ఎలా అడ్డదారుల్లో ఒత్తిడి తీసుకొని వస్తుందో వివరించి చెప్పారు. విద్యుత్ సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో అనేక విషయాలను వెల్లడించారు. మీటర్లు పెట్టకుండా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వొద్దని కేంద్రం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గెజిట్‌లోనే ఉంది. శ్రీకాకుళంలో మీటర్లు పెడితే రైతులంతా ధాన్యాన్ని కుప్పలు పోసి ధర్నా చేశారు. ఈ ప్రమాదం తెలంగాణకు కూడా పొంచి ఉంది. అందుకే మీటర్లు పెట్టబోమని చెబుతున్నాం.. తెలంగాణలో ఉచిత విద్యుత్ ఇస్తుంటే కేంద్రం మోకాలడ్డుతోందని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఏపీ నుంచి రావల్సిన విద్యుత్ ఆగిపోయింది. అప్పట్లో మన వద్ద 7 వేల మెగా వాట్లు మాత్రమే ఉండేది. కానీ ఇవ్వాళ 17 వేల మెగావాట్లకు పెంచుకున్నామన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో 4 వేల మెగావాట్ల ఎన్డీపీసీని తెలంగాణ ప్రాంతంలో నెలకొల్పాలని ప్రతిపాదనలు ఉన్నాయి. నేటికి నాలుగు మెగావాట్లు కూడా ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపించారు. చట్టంలో ఉన్నది నిజంకాదా అని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశ్వగురు మోడీకి ఎనిమిదేళ్లు అయినా ఎన్టీపీసీ ఏర్పాటు సాధ్యపడటం లేదా అని కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీలేరు ప్రాజెక్టు ఏపీలోకి వెళ్లిపోయింది. ఏపీ మన వాటాగా ఇవ్వాల్సిన విద్యుత్‌ను అడిగితే ఇవ్వలేదు. ఏపీఈఆర్సీ, సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు ఇదే విషయం చెబితే.. ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారని కేసీఆర్ గుర్తు చేశారు.

ఆనాటి కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌కు కూడా విద్యుత్ విషయంలో చేసిన అన్యాయాన్ని చెబితే ఆయన స్పందించలేదు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీకి చెందిన నీరజ మాత్రు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని నివేదిక ఇస్తే దాన్ని తొక్కిపెట్టారని కేసీఆర్ అన్నారు. మన రాష్ట్రానికి వాటాగా రావల్సిన విద్యుత్‌ను ఏపీ ఇవ్వకపోతేనే అత్యధిక ధరకు కొని సరఫరా చేశామని కేసీఆర్ చెప్పారు. దాదాపు రూ.700 కోట్ల నుంచి రూ. 800 కోట్ల ఎక్కువ ధరకు కొన్నామని తెలిపారు. ఆ విషయాన్ని మేం కేంద్రానికి చెబితే ఇప్పటికీ మాట్లాడటం లేదని, ఏపీ మాకు బకాయి ఉందని చెప్పినా.. కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు.

ఇప్పుడేమో ఏపీకే తెలంగాణ బాకీ ఉందని చెబుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. రూ.3 వేల కోట్ల బాకీ ఉన్నామని, దానికి మరో రూ. 3 వేల కోట్ల వడ్డీ వేసి మొత్తం రూ. 6 వేల కోట్లు చెల్లించండి.. 30 రోజుల్లో చెల్లించకపోతే కరెంట్ కట్ చేస్తామని అన్యాయంగా లేఖలు రాస్తున్నారని కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అసమర్థత వల్ల తెలంగాణ విద్యుత్ సంస్థలకు రూ. 2,466 కోట్ల నష్టం వచ్చింది. అంత ఎక్కువ ధర చెల్లించాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు అదనంగా మనల్నే కడతావా అని కేంద్రం అనడం అన్యాయం అన్నారు.

ఏపీ నుంచి తెలంగాణకు రూ. 17,828 కోట్లు రావల్సి ఉందని, కృష్ణపట్నంలో మనకు వాటా ఉంద‌ని, ఎంప్లాయిస్ ట్రస్ట్‌లో డబ్బులు ఉన్నాయ‌ని కేసీఆర్ అన్నారు. ఇవన్నీ ఇప్పించమంటే కేంద్రం మౌనంగా ఉంటోంద‌ని, ఇవన్నీ అబద్దాలా..? అవసరం అయితే మేం ఇవ్వాల్సిన రూ. 6వేల కోట్లు కట్ చేసుకొని మిగిలిన డబ్బులు ఇప్పించండి అని కేసీఆర్ అన్నారు. ఏపీ నుంచి తెలంగాణ‌కు డబ్బులు రావల్సింది అబద్దమని నిరూపిస్తే తాను ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాలు విసిరారు. దేశంలో 1,45,000 మెగావాట్ల జల విద్యుత్‌కు అవకాశం ఉందని ఏనాడో నిపుణులు నివేదిక ఇచ్చారని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కేవలం 30,000 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారని అన్నారు. ఇలా ప్రకృతి నుంచే విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉండి కేంద్రం మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోందని మండిప‌డ్డారు. పైగా ఉచితంగా విద్యుత్ ఇస్తున్న తెలంగాణపై అనవసరమైన రాద్దాంతం చేస్తున్నారని కేసీఆర్‌ అన్నారు.

ఇదంతా డిస్కమ్, ట్రాన్స్‌కో, జెన్‌కోలను ప్రైవేటు పరం చేయాలనే దురాలోచన చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. జవహర్‌లాల్ నెహ్రు నుంచి అనేక ప్రభుత్వాలు విద్యుత్‌కు సంబంధించి అనేక ప్రాజెక్టులు నెలకొల్పారు. కొన్ని లక్షల కోట్ల ఆస్తులు విద్యుత్ సంస్థలు కలిగి ఉన్నాయి. వాటని ప్రైవేటుపరం చేయాలని కేంద్రం కుట్ర చేస్తోందని కేసీఆర్ అన్నారు. ప్రజలందరూ ఈ విషయాలని గమనించాలని చెప్పుకొచ్చారు.

First Published:  12 Sept 2022 1:39 PM IST
Next Story