Telugu Global
Telangana

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాబోయే మూడు వారాల పాటు అంగరంగ వైభవంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నామని.. ఈ పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని దశదిశలా చాటాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అన్నారు.

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తి చేసుకొని పదో ఏట అడుగుపెడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్దాల పాటు వివిధ దశల్లో సాగిన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలను ఆయన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా స్మరించుకున్నారు. స్వయం పాలన కోసం ప్రజలను మమేకం చేస్తూ మలి దశ ఉద్యమాన్ని పార్లమెంటరీ పంథాలో.. ప్రజాస్వామ్య పోరాటం దిశగా మలిపిన తీరును సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

శాంతియుతంగా ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని సాగించి.. తొమ్మిదేళ్ల క్రితం స్వరాష్ట్రాన్ని సాధించుకోవడానికి సాగిన మొత్తం ప్రక్రియలో భాగస్వామ్యం అయిన వారిని, ఇందుకు సహకరించిన ప్రతీ ఒక్కరినీ సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. ఈనాడు అభివృద్ధిలో నెంబర్ 1గా దూసుకొని పోతోందని అన్నారు. ఒకనాడు వెనుకబాటుతనానికి చిరునామాగా నిలిచిన తెలంగాణ.. ఈ రోజు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లిందని చెప్పారు. ఇప్పుడు దేశ ప్రజలు 'తెలంగాణ మోడల్' కావాలని కోరుకుంటున్నారని అన్నారు.

దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నందుకు ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాలని అన్నారు. రాబోయే మూడు వారాల పాటు అంగరంగ వైభవంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నామని.. ఈ పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని దశదిశలా చాటాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆస్వాదిస్తున్న ఫలాలను.. ఈ ఆనందకరమైన సమయంలో తప్పకుండా జ్ఞప్తికి తెచ్చుకోవాలని కోరారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రతీ ఒక్కరు పాల్గొని.. సంబురంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.


First Published:  1 Jun 2023 5:10 PM GMT
Next Story