కుల పత్రికలు, గుల పత్రికలు.. కేసీఆర్ టార్గెట్ ఎవరంటే..?
కులపత్రికలు, గుల పత్రికలు అంటూ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ కి కొంతమంది ఆల్రడీ భుజాలు తడుముకున్నారు. కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ ఈరోజు పొద్దున్నే ఆర్టికల్స్ వచ్చేశాయి.
తెలంగాణ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ కి సంబంధించి ఓ చిన్న వీడియో తెగ వైరల్ అవుతోంది. కులపత్రికలు, గుల పత్రికలు అంటూ ఆయన చేసిన కామెంట్స్ కి కొంతమంది ఆల్రడీ భుజాలు తడుముకున్నారు. కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ ఈరోజు పొద్దున్నే ఆర్టికల్స్ వచ్చేశాయి. జర్నలిస్ట్ లను అవమానించారంటూ యాజమాన్యాలు తెగ బాధపడిపోవడం చూస్తుంటే.. సదరు యాజమాన్యాలు ఇంకెంత బాధపడ్డాయో ఊహించుకోవచ్చు. అయితే యాజమాన్యాల పేరెత్తకుండా కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తెలంగాణలో జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాలకు సంబంధించిన ప్రశ్నతో ఈ చర్చ మొదలైంది. ప్రతి రోజూ తెలంగాణ ప్రభుత్వంపై బురదజల్లే వారికి ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తామని ప్రశ్నించారు కేసీఆర్. పాముకి పాలుపోసి పెంచలేం కదా అన్నారు. అదే సమయంలో పేరెత్తకుండానే యాజమాన్యాలపై ఆయన మండిపడ్డారు. "ఇండియాలో (తెలంగాణతో) పోల్చుకోవడానికి కూడా ఇతర రాష్ట్రాలు భయపడే రాష్ట్రంలో.. ‘జీతాలు పడతలేవు’ అని రాస్తారు. ఒక్కటే దెబ్బలో మొన్న రూ.20వేల కోట్ల రుణం మాఫీ చేశాం కదా... ఇప్పుడు ఆ పేపర్.. తలకాయ ఎక్కడ పెట్టుకుంటుంది. అదొక పేపరా? ఏమనుకోవాలి.. అర్థం ఉండాలి. ద బెస్ట్ స్టేట్, ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్‌బీఐ రిపోర్టులు వచ్చాయి. అయినా కూడా మేం ఒకటే రొడ్డ కొట్టుడు కొడ్తం, మా ఇష్టమొచ్చినట్లు రాస్తం అంటే అదేం పేపరండి, దిక్కుమాలిన పేపరు. విజ్ఞత ఉన్నవారికి కూడా సిగ్గనిపిస్తుంది." అన్నారు కేసీఆర్.
న్యూస్ కావాలి, వ్యూస్ కాదు..
తెలంగాణ ఉద్యమ సమయంలోనే పత్రికల గురించి తాను ఓ విషయం చెప్పానని గుర్తు చేశారు కేసీఆర్. ఈ రాష్ట్రంలో కొన్ని కుల పత్రికలున్నాయి, కొన్ని గుల పత్రికలున్నాయని అన్నారు. న్యూస్ పేపర్లు ఉంటే పర్వాలేదని, కానీ ఇప్పుడు వ్యూస్ పేపర్లు ఉన్నాయని చెప్పారు. న్యూస్ మీడియా సంస్థల స్థానంలో వ్యూస్ మీడియాలు వచ్చాయని విమర్శించారు. కులపత్రికలు, గుల పత్రికలంటూ కేసీఆర్ చేసిన కామెంట్లకు అక్కడున్నవారంతా ఘొల్లున నవ్వారు. ఆ తర్వతా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరుసటి రోజు ఆంధ్రజ్యోతిలో.. షర్మిల విమర్శల ట్వీట్ తో సహా ఓ పెద్ద ఆర్టికల్ వచ్చింది.