సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం.. పర్యటనలు ఆలస్యం
ఎన్నికల ప్రచారం కోసం సీఎం కేసీఆర్ ఈరోజు ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ లో దేవరకద్రకు బయలుదేరారు. అయితే హెలికాప్టర్ గాల్లోకి లేచిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమై పైలెట్ వెంటనే సేఫ్ ల్యాండింగ్ చేశాడు.

సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం అనగానే ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు ఉలిక్కిపడ్డారు. కాసేపట్లో సీఎం సభ మొదలవుతుంది అని ఎదురు చూసిన దేవరకద్ర వాసులు ఈ వార్త తెలిసేసరికి షాకయ్యారు. అయితే సీఎం కేసీఆర్ సేఫ్ అని తెలిసి అంతా ఊపిరిపీల్చుకున్నారు. హెలికాప్టర్ సాంకేతిక లోపాన్ని సవరిస్తున్నారు సిబ్బంది.
పైలెట్ అప్రమత్తం..
ఎన్నికల ప్రచారం కోసం సీఎం కేసీఆర్ ఈరోజు ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ లో దేవరకద్రకు బయలుదేరారు. అయితే హెలికాప్టర్ గాల్లోకి ఎగిరిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమై పైలెట్ వెంటనే సేఫ్ ల్యాండింగ్ చేశాడు. లోపాన్ని గుర్తించి హెలికాప్టర్ ను సేఫ్ ల్యాండింగ్ చేశాడు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే హెలికాప్టర్ కిందకు దిగింది. దీంతో సీఎం కేసీఆర్ సహా అందులో ప్రయాణిస్తున్నవారు బయటకు వచ్చారు.
సీఎం కేసీఆర్ ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, గద్వాల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనాల్సి ఉంది. ముందుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఆయన దేవరకద్ర బయలుదేరారు. అయితే హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా ఆయన పర్యటన ఆలస్యమైంది. సీఎం పర్యటన కొనసాగేలా ఏవియేషన్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మరో హెలికాప్టర్ ని సిద్ధం చేస్తున్నారు.