Telugu Global
Telangana

సంపద పెంచాం.. ప్రజలకు పంచుతున్నాం

తన కంటే లావుగా ఉన్నోళ్లు, తన కంటే ఎత్తుగా ఉన్నవాళ్లు చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ తన హయాంలోనే ఇంటింటికీ మంచినీరు ఎందుకొచ్చిందని, ప్రజలు ఆలోచన చేయాలన్నారు సీఎం కేసీఆర్. అప్పుడు నదులు లేవా, నీరు లేదా.. అని ప్రశ్నించారు.

సంపద పెంచాం.. ప్రజలకు పంచుతున్నాం
X

తెలంగాణ తలసరి ఆదాయం ఇండియాలోనే నెంబర్-1 అని చెప్పారు సీఎం కేసీఆర్. రాష్ట్రానికి పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తున్నాయని, దానితోపాటు పన్నులు పెరిగి ఆదాయం పెరిగిందని, ఆ పెరిగిన ఆదాయాన్ని ప్రజలకు పంచుతున్నామని చెప్పారాయన. 2వేల రూపాయల పెన్షన్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఉందని, దీన్ని 5వేల రూపాయలకు పెంచబోతున్నామని చెప్పారు. కర్నాటకనుంచి వచ్చిన నాయకులు తాము 600 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని చెబుతున్నారని, అరే సన్నాసీ మా దగ్గర 2వేలు ఇస్తున్నామని వారికి సమాధానం చెప్పాలన్నారు. కర్నాటకలో 5 గంటలు కరెంటు ఇస్తున్నామని తెలంగాణకు వచ్చి ఆ రాష్ట్ర నాయకులు చెబుతున్నారని, 24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రంలో వారు చేసే ప్రచారం వింటే దేంతో నవ్వాలో అర్థం కావడం లేదన్నారు కేసీఆర్.


తన కంటే లావుగా ఉన్నోళ్లు, తన కంటే ఎత్తుగా ఉన్నవాళ్లు చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ తన హయాంలోనే ఇంటింటికీ మంచినీరు ఎందుకొచ్చిందని, ప్రజలు ఆలోచన చేయాలన్నారు సీఎం కేసీఆర్. అప్పుడు నదులు లేవా, నీరు లేదా.. అని ప్రశ్నించారు. ప్రజల మీద ప్రేమ ఉంటే నీరు రావాలని, వచ్చి తీరాలని, అదే ఇప్పుడు జరుగుతోందన్నారు కేసీఆర్. ఐదేళ్లలోపు ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనని తాను చెప్పానని, నీళ్లు ఇచ్చి చూపించానని అన్నారు. రెండు నదులున్నా కూడా ఎండబెట్టి, పండబెట్టి గత పాలకులు కరువుకి గురి చేశారన్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూడాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక ఇంచ్ కూడా గ్యాప్ లేకుండా నీటిపారుదల జరుగుతోందన్నారు కేసీఆర్. గోదావరిపై సీతమ్మ సాగర్ కట్టాలనే ఆలోచన గత పాలకులకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఏ నాయకుడు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు.

ఎన్నికలు వచ్చాయని ఆగం కావద్దని, ఎన్నికల్లో మంచి చెడు ఆలోచించాలని చెప్పారు సీఎం కేసీఆర్. అబద్ధపు హామీలు నమ్మొద్దన్నారు. తెలంగాణను అణచివేసింది కాంగ్రెస్సేనని చెప్పారు. 2006లోనే కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చి ఉండాలని, అప్పుడే ఇచ్చి ఉంటే బలిదానాలు ఉండేవి కావన్నారు. తెలంగాణ ఇంకా అభివృద్ధి చెంది ఉండేదని చెప్పారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుందన్నారు. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామన్నవారిని అదే బంగాళాఖాతంలో పడేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్. బూర్గంపాడు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం.. ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

First Published:  13 Nov 2023 10:42 AM GMT
Next Story