విద్యా రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు : మంత్రి సబిత ఇంద్రారెడ్డి
ప్రభుత్వ బడులు సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపాలుగా మారాయి. దేశమంతా తెలంగాణ వైపు చూసేలా కార్యక్రమాలు చేపడుతున్నారు.
తెలంగాణ విద్యా రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చారు. రాష్ట్రంలోని 1,200 పైగా గురుకులాలు ఉండగా.. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తోందని మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో జిల్లా పరిషత్ పాఠశాలను ప్రారంభించారు. అనంతరం మంత్రి సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..
ప్రభుత్వ బడులు సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపాలుగా మారాయి. దేశమంతా తెలంగాణ వైపు చూసేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. డిజిటల్ తరగతి గదులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతీ పాఠశాలలో లైబ్రరీ కార్నర్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలోనే జరిగాయని మంత్రి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకు రూ.136 కోట్లతో రెండు జతల యూనిఫామ్స్, రూ.190 కోట్లతో ఉచితంగా టెక్ట్స్ బుక్స్.. రూ.35 కోట్లతో రాగి జావ అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి చెప్పారు.
ఇప్పటికే 12 లక్షల మంది విద్యార్థులకు రూ.56 కోట్ల విలువైన నోట్ బుక్స్, రూ.34.25 కోట్ల విలువైన ట్యాబ్స్ 20 వేల మంది ఉపాధ్యాయులకు అందించామని చెప్పారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా.. మొదటి విడతలో 9,123 పాఠశాలల్లో రూ.3,497.62 కోట్లతో పనులు చేపట్టామని చెప్పారు. ఇప్పటికే 1000 పాఠశాలలను ఏక కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రారంభించారని చెప్పారు.
విద్యారంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ.. పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల విదేశీ విద్య కలను సాకారం చేసే దిశగా ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు కూడా ప్రభుత్వం అందిస్తోందని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదవ తరగతిలో 10 జీపీఏ స్కోర్ సాధించిన విద్యార్థులను సన్మానించి, వారికి రూ.10వేల రివార్డును మంత్రి అందించారు. అలాగే ఉత్తమ ఉపాధ్యాయులను కూడా సన్మానించి, ప్రశంసా పత్రాలు అందించారు.