Telugu Global
Telangana

ఆడబిడ్డలకు సారె పెట్టి గౌరవించుకుంటున్నాం - సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో దీవించాలని ప్రకృతి దేవత బతుకమ్మను ప్రార్థిస్తున్నానంటూ సీఎం కేసీఆర్ తన శుభాకాంక్షల ప్రకటనలో తెలిపారు.

ఆడబిడ్డలకు సారె పెట్టి గౌరవించుకుంటున్నాం - సీఎం కేసీఆర్
X


350 కోట్ల రూపాయల ఖర్చుతో కోటి మంది ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన కోటి చీరలను బతుకమ్మ కానుకగా అందిస్తూ గౌరవించుకుంటున్నామని తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఆడపడుచులకు ఆయన బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నుంచి తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షల ప్రకటన విడుదల చేశారు.

ప్రకృతి ఆరాధన..

పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ చేసుకునే పండగ ఇదని అన్నారు సీఎం కేసీఆర్. బతుకమ్మ వేడుకలు, పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని చెప్పారాయన. ప్రకృతిని ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంబురాన్ని వెల్లివిరిసేలా చేస్తాయని చెప్పారు.

ఆడబిడ్డల ఆత్మగౌరవం..

బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం, తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్ద పీట వేసిందని చెప్పారు సీఎం కేసీఆర్. ప్రజల జీవనంలో భాగమైపోయిన బతుకమ్మ ఖండాంతరాలకు విస్తరించి తెలంగాణ సంస్కృతిని విశ్వ వ్యాపితం చేసిందన్నారాయన. బతుకమ్మ పండుగను జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో దీవించాలని ప్రకృతి దేవత బతుకమ్మను ప్రార్థిస్తున్నానంటూ సీఎం కేసీఆర్ తన శుభాకాంక్షల ప్రకటనలో తెలిపారు.

First Published:  24 Sept 2022 9:50 PM IST
Next Story