Telugu Global
Telangana

సామాన్యుడు విజయుడు.. ఫోజులు కొట్టేవాడు కాదు

పేదరికం నుంచి వచ్చినవాడు, పేదల బాధలు తెలిసినవాడు, ఓ సామాన్యుడు విజయుడు ఈసారి అలంపూర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఆయన ఫోజులు కొట్టేవాడు కాదని.. ఆయన్ను గెలిపించాలని సూచించారు సీఎం కేసీఆర్.

సామాన్యుడు విజయుడు.. ఫోజులు కొట్టేవాడు కాదు
X

ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలంటున్నారని, అప్పుడు ఆకలి బతుకులు తప్ప ఇంకేం లేవన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్‌ నేతలు చేసిన అన్యాయాలను సరిదిద్దుకొస్తున్నామని వివరించారు. పాలమూరులో కరవు రాకుండా చూసే బాధ్యత తనది అని చెప్పారు. కేంద్రం మెడలు వంచైనా సరే వాల్మీకి బోయలకు న్యాయం చేస్తామన్నారు. వాల్మీకి బోయలను బీసీల్లో కలిపింది కాంగ్రెస్‌ పార్టీయేనని విమర్శించారు కేసీఆర్. ఈసారి అధికారంలోకి వచ్చాక వాల్మీకి కులాన్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షనిస్టులు, గూండాలు గెలవకూడదని, ఒకరినొకరు చంపుకునే సంస్కృతి ఉండకూడదన్నారు కేసీఆర్. అలంపూర్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.


సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాంని కాదని, విజయుడుని ఈసారి అలంపూర్ అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్ఎస్. అభ్యర్థి మారినా విజయం మాత్రం బీఆర్ఎస్ దే కావాలని ఆ పార్టీ నేతలు అలంపూర్ లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. విజయుడుని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ అలంపూర్ వాసులకు పిలుపునిచ్చారు. గతంలో అలంపూర్ నుంచి అధికంగా వలసలు ఉండేవని, ప్రస్తుతం పరిస్థితుల్లో వచ్చిన మార్పుని ప్రజలు గుర్తించాలన్నారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. నెట్టెంపాడు పెండింగ్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రైతుల దగ్గర 3 హెచ్.పి. లేదా 5 హెచ్.పి. మోటర్లు ఉంటాయని.. ఇదే జిల్లాలో పుట్టిన పీసీసీ అధ్యక్షుడు రైతులు 10 హెచ్.పి. మోటార్లు పెట్టుకోవాలని చెబుతున్నారని, వాటికి డబ్బులెవరిస్తారని ప్రశ్నించారు కేసీఆర్.

పేదరికం నుంచి వచ్చినవాడు, పేదల బాధలు తెలిసినవాడు, ఓ సామాన్యుడు విజయుడు ఈసారి అలంపూర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఆయన ఫోజులు కొట్టేవాడు కాదని.. ఆయన్ను గెలిపించాలని సూచించారు సీఎం కేసీఆర్. విజయుడిని గెలిపిస్తేనే బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటవుతుందని, మన మేనిఫెస్టోలోని అంశాలన్నీ అమలు చేసుకోగలుగుతామని వివరించారు. తానే నేరుగా అలంపూర్ వచ్చి కూర్చుని సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్.

First Published:  19 Nov 2023 3:51 PM IST
Next Story